తెలంగాణకు మహర్ధశ పట్టనుందా..? మరిన్ని మంచి రోజులు రానున్నాయా..? పెట్టుబడుల వరద వెల్లువెత్తనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు కారణం సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా సాగడమే. మరి తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అగ్రరాజ్యంలో బిజీ అయిన రేవంత్ బృందం ఎవరెవనిని కలిసింది..? ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది..?
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా.. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా బాట పట్టిన సీఎం రేవంత్ టూర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతూ బిజీ అయింది రేవంత్ బృందం. కంపెనీ పెద్దల నుంచి మంచి స్పందన రావడంతో తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. డాలస్, క్యాలిఫోర్నియా తదితర పట్టణాల్లో పర్యటించి రాబోయే దశాబ్ద కాలంలో ఫ్యూచర్ స్టేట్‌గా నిలవనున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు సీఎం. ఈ సందర్భంగా తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు.
ఇప్పటి వరకూ పదకొండు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. మరికొందరు ప్రతినిధులతో చర్చలు సాగుతున్నాయి. ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో 400 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 3 వేల 320 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్‌లో నెక్ట్స్ జనరేషన్, అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం దశలవారిగా పెట్టుబడులు పెట్టనుంది. ఆ సంస్థ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సాతో సీఎం రేవంత్ భేటీ సందర్భంగా తెలంగాణలో విస్తరణ ప్రణాళికలను కంపెనీ ప్రకటించింది. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. అలాగే కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్న ముఖ్యమంత్రి.. ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు.
మరోపక్క తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో రిసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఈ రిసెర్చి సెంటర్లో 3000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం.
హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది. ఇక టూర్‌లో భాగంగా కాలిఫోర్నియాలోని కూపర్టీనోలో ఉన్న ఆపిల్ ఇంక్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించింది రేవంత్‌రెడ్డి బృందం. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు సీఎం.


