ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఏపీ రాజధానిగా విశాఖ పట్టణమే ఉంటుందని తేల్చిచెప్పారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడి నుంచే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించి ఎన్నికల వేళ పెను సంచలనం సృష్టించారు. అదే సమయంలో అమరావతి రాజధానికి తాను వ్యతి రేకం కాదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి ?
సార్వత్రిక ఎన్నికలకు ఓవైపు సమయం దగ్గర పడుతోంది. దేశవ్యాప్తంగా జరగనున్న లోక్‌సభ ఎన్నికలతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం ఎలక్షన్లు జరగనున్నాయి. అన్ని పార్టీలకు ప్రతిష్టా త్మకంగా మారిన 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలని ఎంతో పట్టుదలగా ముందుకెళుతోంది అధికార వైసీపీ. ఈ మేరకు తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. వైనాట్ 175, సిద్ధంపేరుతో సభలను నిర్వహిస్తూ పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాయాత్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా సభల ద్వారా ఓటర్ల vను ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ముఖ్యమంత్రి.
ఈనెల రెండో వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో… విజన్ వైజాగ్ పేరుతో వాణిజ్య, పారిశ్రామిక వేత్తలతో విశాఖలో సమావేశమయ్యారు జగన్. ఈ సమావేశం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ ఉంటుందని ప్రకటించి రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించారాయన. అంతేకాదు.. ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. అలాగే.. ఇక్కడే ఉంటానని ప్రకటించారు. అంతేకాదు.. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారు స్తామ న్నారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే రాజధాని విషయంలో రాష్ట్రంలో అయోమయ పరిస్థి తులు నెలకొన్నాయన్న వాదన బలంగా విన్పిస్తోంది. పైగా ఇది ఎన్నికల సమయం కూడా. ఇలాంటి వేళ ప్రత్యర్థుల ప్రచారం అంతా మూడు రాజధానుల చుట్టే తిరుగుతోంది. దాదాపుగా ఐదేళ్ల పాలన పూర్తైనా ఇంతవరకు ఒక్క రాజధాని కూడా రాష్ట్రానికి లేకుండా పోయిందని విమర్శలు గుప్పిస్తు న్నాయి విపక్షాలు. దీనికితోడు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల అంశంపై తీర్పు పెండింగ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్లు రాజకీయంగా ఒక్క సారిగా కలకలం రేపాయి. పైగా ఎన్నికల తర్వాత ఇక్కడ్నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు.. రాష్ట్ర విభజనతో ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను కోల్పోయామని గుర్తు చేసిన ఆయన.. వైజాగ్‌ను మళ్లీ ఆ స్థాయిలో తీర్చిదిద్దవచ్చ న్నారు. విశాఖకు ఇప్పటికే అవరసమైన అన్ని హంగులూ ఉన్నాయని తెలిపారు జగన్.
మూడు రాజధానులంటూ చెప్పుకొచ్చిన జగన్.. అమరావతి విషయంలో అన్యాయం చేశారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు విశాఖ వేదికగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. శాసన రాజధానిగా అమరావతే కొనసాగుతుందని తెలిపారు. అయితే.. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్షకోట్లు అవసరమవుతాయని చెప్పుకొచ్చారు. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి వేళ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మూడు రాజధానులని అధికార పక్షం చెబుతున్నా.. కోర్టు కేసులు, ఇతరత్రా వివాదాలతో అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ ముఖ్యమంత్రి గతానికి భిన్నంగా.. ఇంకా చెప్పా లంటే మరింత దూకుడుగా రాజధాని విషయంలో ఎందుకు వ్యాఖ్యలు చేశారు ?
గతంలో సీఎం జగన్ ఎప్పుడు మాట్లాడినా తర్వలోనే వైజాగ్ నుంచి పాలన ప్రారంభిస్తామని చెప్పేవారు. కానీ, ఈసారి మాత్రం మరో అడుగు ముందుకేసిన ఆయన… ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖే ఉంటుందని తేల్చిచెప్పడం తోపాటు తాను ప్రమాణస్వీకారం సైతం ఇక్కడ్నుంచే చేస్తానని ప్రకటించడం దేనికి సంకేతం? ఇది ముఖ్యమంత్రిలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనమా లేదంటే వైసీపీ అధికారంలోకి రాకపోతే ఉత్తరాంధ్ర నుంచి రాజధాని తరలిపోతుందని నర్మగర్భంగా ప్రజలకు చెప్పడమా? మతలబేంటి? దీనిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగు తోంది.


