20.2 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

దీదీకి ఈసారి ఎన్నికల్లో గడ్డుకాలమే ?

    పశ్చిమ బెంగాల్ లో 2024 లోక్ సభ ఎన్నికలు మోదీ నియంతృత్వ పోకడలకు, మమతా బెనర్జీ అహంకార ధోరణుల మధ్య పోరాటం కానుంది. 33 ఏళ్లు అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ లను చిత్తుచేసిన తాను బీజేపీ ని కూడా ఒంటిచేత్తో ఎదుర్కొంటానన్న ధీమాతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. స్కామ్ లు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎంసీ 42, బీజేపీ 40, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి 30 సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అటు బీజేపీ, ఇటు కమ్యూనిస్ట్ – కాంగ్రెస్ లను, మరోపక్క ఇండియన్ సెక్యులర్   ఫ్రంట్ ను ఎదిరించి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

    పశ్చిమ బెంగాల్ లో ఈసారి లోక్‌సభ ఎన్నికలు నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీగా జరుగుతు న్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం లోక్‌సభ సీట్లు 42. కాగా 2019 ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి సవాల్ విసిరి బెంగాల్లో 18 సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి బీజేపీ శిబిరం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈసారి అసలు అభ్యర్థి ఎవరో కాదు. ప్రధాని నరేంద్ర మోడీయే అన్నట్లు కమలం పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బెంగాల్లో కమలం పార్టీ క్రమక్రమంగా బలపడుతోంది. 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ 17 శాతం ఓట్లు సాధించింది. 2019 వచ్చే నాటికి ఓట్ల శాతం గణనీయంగా పెంచుకుంది. 40 శాతం ఓట్లు సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ కు సవాల్ విసిరింది కమలం పార్టీ. 2019 ఎన్నికల్లో మమతా బెనర్జీ మీద కోపంతో కాంగ్రెస్, వామపక్షాల సానుభూతిపరులు బీజేపీకి ఓటేశారంటారు రాజకీయ పరిశీలకులు. అయితే 2019 ఎన్నికల్లో కమలం పార్టీకి పడ్డ కాంగ్రెస్, వామపక్షాల ఓట్లు ఈసారి కూడా అలాగే పడతాయా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.కిందటి సారి ఎన్నికల ట్రెండే ఈసారి కూడా రిపీట్ అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. లేదంటే బెంగాల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది.

   ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విషయానికొస్తే, ఈసారి ఎన్నికలు ఆమెకు నల్లేరుమీద నడక ఏమాత్రం కాదు. బీజేపీ నుంచి ఈసారి టీఎంసీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 22 నియోజకవర్గాలను గెలుచుకుంది. ఈసారి సగం సీట్లయినా మమతా బెనర్జీ పార్టీ గెలుచుకుం టుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. తృణమూల్ కాంగ్రెస్ ను కొంతకాలంగా వరుస కుంభకోణాలు వెంటాడుతున్నాయి. అంతేకాదు కుంభకోణాల్లో చిక్కుకున్న వారిని మమతా బెనర్జీ రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు జనంలోకి వెళ్లాయి. అలాగే సందేశ్‌ఖలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఎపిసోడ్ తృణమూల్ కాంగ్రెస్‌కు మైనస్ పాయింట్‌గా మారింది. మహిళలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడిపోయింది మమతా బెనర్జీ పార్టీ. ఈ అంశాలన్నీ ప్రజల్లో మమతా బెనర్జీ సర్కార్‌ పట్ల తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అయితే ఈసారి ముస్లిం మైనారిటీల ఓట్లపై తృణ మూల్ కాంగ్రెస్ బోలెడు ఆశలు పెట్టుకుంది. బెంగాల్ జనాభాలో 30 శాతం మంది ముస్లింలు న్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లు గంపగుత్తగా తమ పార్టీకే పోల్ అయితే, ఇక బీజేపీని పట్టించుకోన వసరం లేదన్న లెక్కల్లో ఉన్నారు టీఎంసీ నేతలు. అయితే ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో బెంగాల్ ముస్లింలు మొత్తం 42 సీట్లకు పోటీ పడుతున్నారు.దీంతో ఈసారి ముస్లిం మైనారిటీల ఓట్లు చీలిపోతాయన్నది కోల్‌కతా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న టాక్.

   ఇదిలాఉంటే పౌరసత్వ సవరణ చట్టం, జూట్‌మిల్లు కార్మికులు, నిత్యావసరాల ధరల పెరుగుదల ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన జూట్‌ మిల్లులు ప్రస్తుతం దివాళా అంచున ఉన్నాయి. అలాగే జూట్ సాగు చేసే రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వీరిని ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు శ్రమిస్తున్నాయి.ఇక బెంగాల్లో  బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు, మయన్మార్ నుంచి రోహిం గ్యాల వలసలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేసి, ఓటర్ల జాబితాలో పేర్లు చేర్పించి లబ్ధి పొందుతోందనే ఆరోపణ తృణమూల్ కాంగ్రెస్‌పై ఉంది. సీఏఏను మమతా బెనర్జీ వ్యతిరేకించడానికి ఇదీ ఓ కారణం అంటున్నారు రాజకీయ పరిశీల కులు.వీటన్నిటితో పాటు బెంగాల్లో ఇటీవల శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నమైంది. దీంతో మమతా బెనర్జీ సర్కార్‌పై సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పరిస్థితిని అదుపు చేయడంలో మమతా బెనర్జీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్, ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ బెంగాల్ వరకు ఒంటరి గానే పోటీ చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని టీఎంసీ తెగేసి చెప్పింది. కాగా లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరీపై క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను పోటీ పెట్టడం విశేషం.

ఒకప్పడు బెంగాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన కమలం పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా పుణ్యమా అంటూ బలపడింది. ఈ ఎన్నికల్లో సీఏఏ అంశం తమకు అనుకూలిస్తుందని బీజేపీ భావిస్తోంది. అంతే కాదు.  హిందుత్వ అజెండాను బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమలం పార్టీ విజయం సాధించింది. బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్