స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చిరస్మరణీయ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మేజిక్ ఫిగర్ కన్నా మెజార్టీ సీట్లు దక్కించుకుంది. మొత్తం 136స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. అయితే 1957 నుంచి ఓ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఈసారి కూడా అదే రిపీట్ అయింది.
హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని గడగ్ జిల్లాలో ఉన్న రోన్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో కూడా ఆ పార్టీనే అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. మొత్తం 2,21,059 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,11,475, మహిళలు 1,09,570మంది ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రోన్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంగానగౌడ పాటిల్ గెలుపొందారు. దీంతో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ అధికారంలో కొనసాగింది. 2013 ఎన్నికల్లో సంగానగౌడ పాటిల్ కాంగ్రెస్ నుంచి గెలుపొందగా అప్పుడు కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉంది. 1957 నుంచి ఇదే రిపీట్ అవుతూ వస్తోంది. దీంతో ఆ నియోజకర్గం పేరు మార్మోగిపోతోంది.