తాడిపత్రిలో నియోజకవర్గంపై ఉన్న పట్టును ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి నిలుపుకుంటారా లేదంటే జేసీ ఫ్యామిలీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా ? అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా జరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలం. ఎవరికి ప్రతికూలం.! ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రానున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీయే కాదు. నేతలు ఎవరికి వారు తమదైన లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్ననాయకుల్లో, కేడర్‌లో బీపీ పెరిగిపోతోంది.
ఢీ అంటే ఢీ. నువ్వా-నేనా. ఇలాంటి పదాలన్నీ అక్కడ జరిగిన పోరు ముందు తక్కువే. అవును ఉమ్మడి అనంత పురం జిల్లాలోని తాడిపత్రిలో హైఓల్టేజ్ ఫైట్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ అసెంబ్లీకి సైతం ఎలక్షన్లు జరిగాయి. దీంతో అధికార, విపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉన్నా వాటిలో కొన్నిచోట్ల పోరు రాజకీయ పార్టీలనే కాదు. సామాన్య ప్రజానీకంలోనూ ఎంతో ఆసక్తి కలిగించాయి. అలాంటి వాటిలో అగ్రభాగాన ఉంది తాడిపత్రి.
మే 13న పోలింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ, ఫలితాలు వచ్చేందుకు ఇంకా సమయం ఉండడంతో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. జూన్ నాలుగున ఎవరి జాతకం ఏంటో తెలియనున్నా అప్పటివరకు ఎవరి అంచనాలు వారివే. ఎవరికి మాట వారిదే. ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ జరిగిన పోలింగ్ శాతమే. తాడిపత్రిలో 83 శాతం ఓటింగ్ జరగడంతో ఏయే అంశాలు ప్రభావం చూపాయి. ఎవరి ఓట్లు ఎటు పడ్డాయి. పోలింగ్ సరళి ఎవరికి అనుకూలం. ఎవరికి ప్రతికూలం. ఇలా అనేక ప్రశ్నలతో అభ్యర్థులు సతమతమవుతున్నారు. వాళ్లే కాదు. ఏ నలుగురు కలిసినా తాడిపత్రిలో గెలిచేదెవరు. ఓడేదెవరు అన్న మాట మాట్లాడుకుంటున్నారు. వాస్తవా నికి తాడిపత్రి నియోజకవర్గంపై దశాబ్దాలుగా తన పట్టు కొనసాగిస్తోంది జేసీ ఫ్యామిలి. ఇక్కడ పెద్దారెడ్డి కుటుంబానికి, జేసీ ఫ్యామిలీకి మధ్య 30 ఏళ్లుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. రాజకీయంగా ఇవి తారస్థాయికి చేరుకు న్నాయి. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇక్కడ జేసీ కుటుంబానికే ప్రజలు పట్టంకట్టారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మె ల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి 2014లో తాడిపత్రి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా గెలుపొందారు.
2019లో మాత్రం సీన్ మారిపోయింది. అత్యంత హోరాహోరీగా సాగిన నాటి ఎన్నికల్లో మొదటిసారిగా జేసీ ఫ్యామిలీపై ఆధిపత్యం ప్రదర్శించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి కుమా రుడు అస్మిత్ రెడ్డి పోటీ చేయగా పెద్దారెడ్డి విజయం సాధించారు. అంతే అప్పట్నుంచి నియోజ కవర్గం లో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత పెరిగాయన్న అభిప్రాయాన్ని నియోజకవర్గ ప్రజలే విన్పిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి ఉండగా మళ్లీ 2024 ఎన్నికలు వచ్చాయి. దీంతో మరోసారి గెలిచి తాడిపత్రిపై పట్టు నిలుపుకునేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి గట్టి ప్రయ త్నాలు చేయగా దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న స్థానంలో మళ్లీ గెలిపి పూర్వవైభవం సంతరించుకు నేందుకు జేసీ కుటుంబం ప్రయత్నించింది.
ఎన్నికల కోడ్ వచ్చింది మొదలు ఇరువురు నేతలు, వారి కుటుంబాలు ప్రచారాన్నిహోరెత్తించారు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పైచేయి సాధించేందుకు చేయాల్సినవన్నీ చేశారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేయా లన్న ఆకాంక్షతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. గతానికి భిన్నంగా గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు.అయితే పెద్దారెడ్డి మాత్రం 2019లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తన వంతు ప్రయత్నం చేశారన్న వాదన విన్పి స్తోంది. నాటి ఎన్నికల్లో గెలిచినా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పటికప్పు డు, ఎక్కడికక్కడ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇలా ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తే పార్టీ పరంగా ఏయే పనులు చేయిస్తారన్నది చెప్పుకుంటూ వచ్చారు. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్నది వివరించారు. అయితే, పోలింగ్ సరళి చూస్తే 83 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో గ్రామాల వారీగా, బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పడ్డాయి. అవి ఎవరికి అనుకూలం. ఎవరికి ప్రతికూలం అనే కోణంలో విశ్లేషించే పనిలో గత కొద్ది రోజులుగా నేతలు, నాయకులు నిమగ్నమయ్యారు. తాడిపత్రి పట్టణంతోపాటు పెద్దవడుగూరు మండలంలో తమకు పెద్ద ఎత్తున అను కూల ఓట్లు పడ్డాయని కూటమి నేతలు భావిస్తున్నారు.అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రతీ చోటా తమకు అనుకూలంగానే ప్రజలు తీర్పు ఇచ్చారని భావిస్తు న్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కట్టుగా పోటీ చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు లేకపో వడం, ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న విపక్షాల ప్రచారం తమకు బాగా కలిసి వచ్చిందని చెబుతోంది జేసీ కుటుంబం. అయితే మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అందే పథకాలు, ఇతర వర్గాలకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు తమకు ప్లస్ అవుతాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెబుతున్నారు. మరి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారు? మరోసారి వైసీపీకే పట్టం కట్టారా లేదంటే కూటమికి అవకాశం కల్పించారా అన్నది తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే.