అధికార వైయస్సార్ పార్టీలో ప్రకంపనలు వినిపిస్తున్నాయి. 30మంది ఎమ్మెల్యేలు హిట్ లిస్టులో ఉన్నారనే ప్రచారంతో నేతల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ కథేమిటో తెలుసుకుందామా…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో అధికారంలో ఉన్న వైయస్సార్ పార్టీ అధినేత సీఎం జగన్మోహనరెడ్డి పార్టీ అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేలు అందరూ ప్రజల వద్దకు వెళ్లాలి. వారి సమస్యలను వినాలి. వారికి అందుబాటులో ఉండాలి. అలా తమ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటిని టచ్ చేయాలనేది కాన్సెప్ట్.
ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచింది. ప్రతీ రెండు నెలలకి ఒకసారి ఈ కార్యక్రమంపై జగన్ సమీక్ష చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై సమావేశం నిర్వహించడంతో నాయకుల్లో బెరుకు మొదలైంది. ఈ కార్యక్రమం మొదట్లో గడపగడపకు అంటూ ఉత్సాహంగా తిరిగిన ఎమ్మెల్యేలు కాలక్రమంలో తగ్గించారు. అలా తిరగని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని జగన్ పలుమార్లు హెచ్చరించినప్పటికి ఫలితం లేకుండా పోవడంతో ఇప్పుడాయన 30మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొరడా ఝులిపించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల భోగట్టా.
ఇదంతా ప్రశాంత్ కిషోర్ సలహా ఫలితమేనని అంతా అనుకుంటున్నారు. అలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వల్లే గుజరాత్ లో మోదీ మళ్లీ విజయ దుందుభి మోగించగలిగారని విశ్లేషకుల మాట. ఇప్పుడదే అస్త్రాన్ని జగన్ తీయనున్నారని సమాచారం. జనానికి దూరమైన వారిని తప్పించడానికి వెనుకాడనని సీఎం జగనే స్వయంగా చెబుతున్నారు.
ఇప్పటికే రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు తిరగకపోవడంతో వారిని పక్కన పెట్టారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇక మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో మమేకం కావడంలో విఫలమయ్యారని, ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే సర్వే నివేదికలు కూడా జగన్ కి అందాయి.
మరి వాటిని దృష్టిలో పెట్టుకుని జగన్ అలా అంటున్నారా? అందుకే గడపగడపకు మన ప్రభుత్వంలో సరిగ్గా తిరగడం లేదని చెబుతున్నారా? అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడందరి మదిలో మెదిలే ప్రశ్న ఏమిటంటే ఇంతకీ ఆ 30మంది ఎవరు? ఆ హిట్ లిస్టులో ఎవరున్నారు? ఎవరికి జగన్ చెక్ చెబుతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


