చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చైనీయులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా తియానన్మెన్ స్వ్కేర్ ఆందోళనలు చేపట్టిన తర్వాత ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో తెల్ల కాగితాలను చేతబూని నిరసనలు చేపట్టారు. దీనిని మొగ్గదశలోనే అణిచివేసేందుకు జింగ్ పింగ్ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంటుంది.
దీంతో ఈ తెల్లకాగితం విప్లవం ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. చైనాలో ఎవరైనా ఆందోళనలు చేపడితే ప్రభుత్వం మొగ్గ దశలోనే నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని కానీ.. వ్యక్తులను గానీ కించ పర్చకుండా ప్రజలు తమ నిరసనను తెల్ల కాగితాన్ని ఉపయోగిస్తుంటారు.
ఏ4 సైజు ఉండే తెల్ల కాగితంపై తాము చెప్పదలుచుకున్నది రాసి నిరసన వ్యక్తం చేస్తారు. దీంతోపాటు చైనాలోని సెన్సార్ షిప్ ను తెలియజేయడానికి.. శ్వేతపత్రానికి గుర్తుగా ఆందోళనకారులు తెల్ల కాగితాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ తెల్లకాగితం విప్లవం లేదా ఏ3 విప్లవాన్ని ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయం విద్యార్థులు ముందుండి నడిపిస్తున్నారు.
2020 హాంకాంగ్ ఆందోళన సమయంలోనూ చైనీయులు తెల్ల కాగితాన్ని గుర్తుగా వినియోగించుకొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఇప్పుడు నేరుగా ఆందోళనకారులు చైనా ప్రభుత్వంపై తెల్ల కాగితాన్ని వినియోగిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ తెల్లకాగితం ప్రదర్శనను సోషల్ మీడియాలోనూ కన్పించకుండా చైనా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. చైనా టెక్ దిగ్గజాలైన టిక్ టాక్.. విబో వంటి వాటిల్లో తెల్లకాగితం చిత్రాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చేస్తుంది. ఈ ఉద్యమం తీవ్రతరం కాకుండా ప్రభుత్వం ఏకంగా ఏ4 విక్రయాలను నిలిపి వేసిందనే వదంతులు కూడా వ్యాపించాయి.
ఈ నేపథ్యంలో అక్కడి ప్రముఖ స్టేషనరీ చైన్ స్టోర్ సంస్థ ‘ఏం అండ్ జీ స్టేషనరీ’ షేర్లు ఏకంగా 3.1శాతానికి పడిపోయింది. అయితే ఏ4 కాగితాల విక్రయాలను ప్రభుత్వం నిలిపి వేయలేదని ఆ తర్వాత ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అయితే చైనాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన జిన్ పింగ్ కు తెల్ల కాగితం నిరసనలు అగ్నిపరీక్షగా మారాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి ప్రజలంతా స్వేచ్ఛగా తిరుగుతుంటే చైనాలో మాత్రం మూడేళ్లుగా పరిస్థితి మాత్రం మారడం లేదు. దీనికితోడు ఇటీవల కోవిడ్ బస్సు ప్రమాదానికి గు రై 27 మంది మృతిచెందారు. దీనికితోడు లాక్డౌన్ల ను వ్యతిరేకిస్తూ పలుచోట్ల కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు.
ఇటీవల షింజియాంగ్ లోని ఉరుంకీ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందాడం ప్రజల ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ నగరం దాదాపు వంద రోజులపాటు కఠిన లాక్ డౌన్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ లాక్ డౌన్ ను ప్రజలు దాటి.. షీజింగ్ పింగ్ ను అధ్యక్షుడిగా తొలగించాలనే డిమాండ్ వరకు చేరుకుంది.