తన స్నేహితులతో తిరుగుతున్నాడని తల్లి, అన్న తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అమ్మేయడంతో మనస్తాపం చెందిన 17 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. పిస్టల్‌తో కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
9వ తరగతి చదువుతున్న యువకుడు.. చనిపోయాక మనుషులకు ఏమవుతుంది?.. అని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గూగుల్ చేశాడు. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. జనవరి 11న మీరట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి తమ తల్లిని తీసుకురావడానికి అతని అన్నయ్య వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. తిరిగి వచ్చేసరికి డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉంది. లోపలి నుంచి పెద్ద శబ్దం వినిపించింది.
దీంతో వారు కిటికీలోంచి ఇంటి లోపలికి వెళ్లారు. లోపల యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
బాలుడి తల్లి మీరట్ మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తోంది. మృతుడి అన్నయ్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని, వారి తండ్రి గతేడాది మరణించాడని పోలీసులు చెప్పారు. 17 ఏళ్ల యువకుడు తన చదువుపై ఫోకస్ చేయకుండా స్నేహితులతో కలిసి బైక్‌పై తిరుగుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తరచూ అతనిని మందలించేవారు. కనీసం బుల్లెట్‌ను అమ్మేస్తే చదువుపై శ్రద్ధ పెడతాడనే ఉద్దేశంతో ఆ పని చేసినట్టు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు దీనిపై కంప్లైంట్ ఇవ్వలేదని.. వాళ్ల ఇంట్లో పిస్టల్‌ని స్వాధీనం చేసుకునట్టు పోలీసులు చెప్పారు. ఆ యువకుడికి పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.