Talasani Srinivas Yadav| ‘ఒకనాడు ఎట్లుండె తెలంగాణ… ఇప్పుడు ఎట్లయ్యింది’ అని తెలుపుతూ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. తెలంగాణ రాకముందు ఉన్న బీడుపడ్డ భూములు చూస్తూ ఆవేదన చెందుతున్న రైతన్నలు, కరెంట్ మోటార్లు కాలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్న గోడును వీడియోలో మొదటగా చూపించారు. అనంతరం సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కోసం కొట్లాడిన తీరు, టీఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ సాధన కోసం ధూమ్ – ధామ్ లు చేసిన ఫోటోలు, చావునోట్లో తలపెట్టిన సీఎం కేసీఆర్ ముఖాన్ని ఇందులో చూపించారు. అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ బిల్ పాస్ అయిన చిత్రాన్ని చూపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తరువాత తెలంగాణలో జరుగుతున్న అభివుద్దిని చూపించారు. ఎటు చూసినా పచ్చని పొలాలు, నిరంతరాయంగా వస్తున్న విద్యుత్, విశాలమైన రోడ్లు ఇందులో చూపించారు. ‘నాడు… సమైక్య రాష్ట్రంలో పడావు పడ్డ భూములు… నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే అన్నపూర్ణగా మారిన మన తెలంగాణ’ అంటూ శీర్షికను జోడిస్తూ వీడియో పోస్ట్ చేశారు.
అయితే ఈ వీడియో ను చూసిన రాష్ట్ర రైతులు సంతోషపడుతున్నారు గాని.. నిరుద్యోగులు మాత్రం మాకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ మనోవేదన చెందుతున్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగం పోతుందని ఎన్నో కళలు కన్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. అటు ఇంటికి వెళ్తే… ఉద్యోగం లేని ముఖాలను అవ్వా అయ్యకు చూపించలేక, చుట్టాల ఇంటికి వెళ్తే.. ఏం చేస్తున్నావ్ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. ఎక్కడికైనా వెళ్ళి నాలుగు రోజులు ఉందామంటే చేతిలో రూపాయి లేక.. నానా ఇబ్బందులు పడుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పడు పడుతాయి అంటూ.. 30 ఏళ్ళు వచ్చినా యూనివర్సిటీలో పడి చస్తున్నామని తల్లడిస్తున్నారు. మింగలేక కక్కలేక.. చదివిన చదువు దగ్గర ఉన్నా.. ఏ ఉద్యోగం లేకుండా యూనివర్సిటీల్లోపడి ఉంటున్నామని బాధను తెలుపుతున్నారు. దయచేసి ఎక్కువగా ఓట్లు ఉన్న రైతుల గురించే కాకుండా.. దయచేసి మా గురించి కూడా కాస్త ఆలోచించండి ముఖ్యమంత్రి అంటూ దీనస్థితిని వెల్లడిస్తున్నారు. ‘తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు.. నీళ్లు వచ్చాయి, రాష్టం సిద్దించినపుడు నిధులు పుష్కలంగా ఉండే.. తమరి పాలనలో అప్పుల పాలాయె.. కనీసం నియామకాలు అయినా ఇచ్చి పుణ్యం గట్టుకొండి’ అంటూ నిరుద్యోగ యువత ఆవేదన వెల్లడిస్తున్నారు.
#TriumphantTelangana https://t.co/OyGcYRZ5F0
— Talasani Srinivas Yadav (@YadavTalasani) April 3, 2023