28.8 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

కృష్ణా నదీ జలాల్లో ఎవరి వాటా ఎంత ?

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదీజలాల వివాదం చాలాకాలంగా నడుస్తోంది. ఈ విషయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది. అంతిమంగా చర్చ ముగిశాక, బీఆర్ఎస్ కూడా సదరు తీర్మానానికి మద్దతు తెలిపింది. ఇంతకీ ఈ తీర్మానం ఏమిటంటే, ‘‘కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ఉన్న కామన్ ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలంను కృష్ణా నది యాజమాన్య సంస్థకు అప్పగించేది లేదు.’’. అంతేకాదు అప్పటికి నాగార్జున సాగర్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవా లని కూడా తీర్మానం పేర్కొంది.

  కృష్ణా నదీజలాల వివాదానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడానికి కారణాలున్నాయి. 2023 నవంబర్ 29న తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సగ భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద రాజకీయ దుమారం రేపింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూస్తుండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చూస్తోంది. అలాంటిది నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా పోలీసులను పంపించింది. పోలీసుల సాయంతో నీటిని విడుదల చేయించింది. ఈ సమయంలో 13వ గేటు వద్ద పోలీసులు కంచె వేశారు.కుడి కాలువ నుంచి దాదాపు 5,450 క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది. సరిగ్గా తెలంగాణలో ఎన్నికల రోజున జరిగిన ఈ సంఘటన రాజకీచ దుమారానికి తెరలేపింది.

    తెలంగాణ పోలింగ్ ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోమ్ శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ డ్యాంను సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఉంచడానికి రెండు రాష్టాలు అంగీకరించాయి. అప్పటి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ బలగాలే బందోబస్తు కాస్తున్నాయి.కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఈ వివాదం మరోసారి భగ్గుమన్నది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. టెయిల్ పాండ్‌లో నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో టెయిల్ పాండ్ ను తెలంగాణ నీటి పారుదల రంగ అధికారులు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. కాగా ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ తీరుపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఈ సంఘటనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేస్తుందన్న విమర్శలున్నాయి. మరోవైపు అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. ఈ అంశంపై తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. టెయిల్ పాండ్ నీళ్లు చోరీకి గురికావడానికి తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు జగదీశ్వర్‌రెడ్డి.

  కృష్ణా నదీజల వివాదాలపై 1969లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ 1976 మే నెలో తుది తీర్పు వెలువరించింది. దీని ప్రకారం కృష్ణానది బేసిన్‌లో 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజారావు కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు వేర్వేరుగా నీటి కేటాయింపులపై ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. 298.96 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా 512.04 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. కాగా విభజన తరువాత కూడా నీటి వ్యవహారాలకు సంబంధించి ఇవే కేటాయింపులు కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.‘‘కృష్ణా నది నీటి పంపిణీలో గతంలో వివక్ష జరిగింది. క్యాచ్ మెంట్ ఏరియా, కరవు ప్రాంతాలు, బేసిన్ జనాభా, సాగు విస్తీర్ణం ఆధారంగా నీటి పంపిణీ జరగాలి. తెలంగాణ హక్కుల కోసం, నీటి వాటా కోసం పోరాడతాం’’ అని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా బచావత్ ట్రిబ్యునల్ లెక్కించిన నికర జలాల ఆధారంగా అప్పట్లో కేటాయింపులు జరిగాయన్నారు నీటిపారుదలరంగ నిపుణులు. ఈ కేటాయింపులు మార్చాలం టే మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచే జరగాలన్నారు. గతంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాచ్ మెంట్ ఏరియాను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అప్పుడే తెలంగాణకు నీటి కేటాయింపులు న్యాయంగా జరిగేవన్నారు.

  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక విభజన హామీలకు సంబంధించి గొడవలు ఉన్నాయి. ఇందులో భద్రాచలం విలీన గ్రామాలు ఒకటి. విభజన జరిగిన తొలి రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సమీపానగల ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ లో విలీనం చేశారు. దీనిపై తెలంగాణ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఇదే అంశాన్ని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏటిపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయితీలను మళ్లీ భద్రాచలం లో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రెండేళ్ల కిందట జులైనెలలో చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 72.8 అడుగులకు చేరింది. భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం నుంచి 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించింది. గోదారమ్మ ఉగ్రరూపానికి భద్రాచలం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వందలాది గ్రామాలు నీటమునిగాయి. అప్పట్లో వచ్చిన గోదావరి వరదలు వివాదంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు పుట్టించింది.

  పోలవరం ప్రాజెక్ట్ వల్లే భద్రాచలం సహా పలు గ్రామాలు జలమలం అయ్యాయని అప్పట్లో తెలంగాణ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చివేయాలన్నారు. అప్పట్లో పువ్వాడ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసింది. పువ్వాడ కామెంట్లపై అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని సీరియస్‌గా తీసుకున్నారు. గోదావరి నదిపై పువ్వాగ అజయ్ కుమార్ కు అసలు అవగాహనే లేదని పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య గొడవలు రావడం సహజం. అయితే ఈ విభేదాలను పెద్ద మనస్సుతో పరిష్కరించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలి. ఇప్పటివరకు ఉన్న ఘర్షణాత్మక వైఖరికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎండ్‌కార్డ్ వేయాలి. సంయమనంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలంటున్నారు ప్రజలు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్