నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం, నీటి పారుదల శాఖ మంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. తుంగభద్రా నదిపై కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టి నీళ్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
” గోదావరి నదిపై బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలించే ప్రయత్నం ఏపీ చేస్తోంది. గోదావరి బేసిన్‌లో 4 ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. ఏపీ ప్రభుత్వం 200 టీఎంసీలు పెన్నా బేసిన్‌కు తరలించాలని చూస్తోంది. ఏ అనుమతులు లేకుండా గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క లేఖ రాయలేదు.
బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. రూ.80,142 కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు రెండు లేఖలు రాశారు. రూ. 40 వేల కోట్లు ఇప్పిస్తామని కేంద్ర మంత్రి ఏపీకి హామీ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు కట్టాలంటే తెలంగాణ ఒప్పుకోవాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేదు. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం వద్దకు రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని
తీసుకువెళ్లాలి.
ఇరిగేషన్ సలహాదారులు ఏం చేస్తున్నట్లు…?. ఆదిత్యనాధ్ దాస్ ఏపీ ప్రభుత్వం తరపున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తప్పుడు వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు 3 నెలలు జైలు శిక్ష వేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆదిత్యనాధ్ దాస్‌ను ఎలా తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించారు?. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా…? తుంగభద్రలో కర్ణాటక నావలి రిజర్వాయర్ కెనాల్ ను 50 టీఎంసీలకు పెంచింది. ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నుండి నీళ్ళు తరలించే ప్రయత్నం చేస్తోంది. శ్రీశైలం ఎండిపోయే పరిస్థితి ఉంది.
కర్ణాటక, ఏపీ ప్రభుత్వం చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు నిధుల కోసం ఉత్తరాలు రాస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి వద్దకు వెళ్లి క్రిష్ణా నదీ జలాలను ఏపీ,తెలంగాణ మధ్య పంచాలని కేసీఆర్ లేఖ ఇచ్చారు. సెక్షన్ 3 అమలులో ఉంటే సెక్షన్ 89 ఉండదు. ఏపీ.. సుప్రీంకోర్టులో కేసు వేస్తే తెలంగాణ ఎందుకు కేవియట్ వేయలేదు. నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అన్ని ఫోరమ్స్ కు లేఖలు రాయాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. సాగునీటి పారుదల శాఖా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలం అయ్యారు. గోదావరి, బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం తెలిపితే సీఎం రేవంత్ రెడ్డి లెటర్ చూపించాలి. మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకోవాలంటే దావోస్ వరకు వెళ్లాలా?”.. అని హరీశ్‌రావు ప్రశ్నించారు.