ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారు. విజయవాడ జిల్లా జైలులో ములాఖత్ సందర్భంగా వంశీని కలిసిన కొద్దిసేపటికే జగన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వల్లభనేని వంశీ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని..ఇది శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతుందని జగన్ అన్నారు. వంశీ వర్గం గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేసిన నేరాన్ని పెద్దగా పట్టించుకోకూడదని ఆయన సూచించారు.
“వంశీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో బాధితుడు సత్యవర్ధన్ దాఖలు చేసిన వాంగ్మూలంలో కూడా వంశీ పేరు ప్రస్తావించలేదు. చంద్రబాబు ఏదో ఒక విధంగా వంశీని అరెస్టు చేయాలనుకున్నాడు, అందుకే ఆయన తప్పుడు కేసు పెట్టాడు. బాధితుడే వంశీపై కేసును ఉపసంహరించుకుంటే, ప్రభుత్వం ఇప్పటికీ అతనిపై కేసు పెట్టి ఎలా అరెస్టు చేసింది?” అని జగన్ ప్రశ్నించారు.
పులివెందుల ఎమ్మెల్యే ఇంకా మాట్లాడుతూ.. వంశీని రెచ్చగొట్టడానికి చంద్రబాబు గతంలో పట్టాభిని ఉసిగొల్పారని.. ఫలితంగా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపించారు. వంశీకి ఈ దాడిలో ఎలాంటి సంబంధం లేదని జగన్ స్పష్టం చేశారు.
ఆ తర్వాత జగన్ ఓ షాకింగ్ స్టేట్‌మెంట్ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ తాను వదిలిపెట్టనని.. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను హెచ్చరించారు.
” అన్యాయం చేసిన వాళ్లని బట్టలూడదీసి నిలబెడతాం. రిటైర్ అయినా, వేరే దేశం వెళ్లినా, ఇక్కడికి తెచ్చి నిలబెడతాం”.. అని జగన్ అన్నారు.
పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ చేయాలి కానీ.. టీడీపీ నాయకులకు సెల్యూట్ చేయకండి అని జగన్ సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చట్టం ముందు నిలబెడతామని అన్నారు. పోలీసులు అన్యాయం వైపు ఉండొద్దని చెప్పారు. అలా చేస్తే ప్రజాస్వామ్యం కూలిపోతుందన్నారు. ప్రతీ కేసులోనూ టీడీపీ వాళ్లు బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు
పోలీస్ శాఖకు వ్యతిరేకంగా స్వయంగా ఓ మాజీ ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేయడం జగన్‌కు అంత మంచిది కాదు. పోలీసుల తీరుపై వ్యాఖ్యలు చేస్తూ తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. ఇది ఆయన ప్రజా ప్రతిష్టను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ స్టేట్ మెంట్స్ ఆయన రాజకీయ జీవితం మీద ప్రభావం చూపినా ఆశ్చర్యపోనవసరం లేదు.