JC Prabhakar Reddy | అక్రమ ఇసుక రవాణా చేస్తే ట్రాక్టర్, టిప్పర్ కాల్చివేస్తానని హెచ్చరిక జారీ చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణాపై జేసీ మండిపడ్డారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణాదారులపై కొరడా ఝలిపించారు. అక్రమ ఇసుక బకాసురులకు వారం రోజుల గడువు ఇచ్చారు. గడువు తరువాత అక్రమ ఇసుక రవాణా ఎవరు చేసినా ట్రాక్టర్, టిప్పర్లు కనపడితే కాల్చివేస్తానంటూ సంచలన వైఖరి తెలియజేశారు.
తాడిపత్రి ప్రాంతంలో పెన్నా నది పొడవున వందల మందితో గస్తీ పెడతానని అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ పట్టుబడితే మొదటి తప్పుగా టైర్లలో గాలి తీసేస్తానని, రెండవసారి పట్టుబడితే కాల్చివేస్తానంటూ పేర్కొన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి సచివాలయ ఉద్యోగి, ప్రతి వాలంటీర్ తన మాట వినాల్సిందేనని జేసీ అల్టిమేటం జారీ చేశారు. తాడిపత్రి పరిధిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే… తహసీల్దార్, ఎంపిడీఓ, మైన్స్,సెబ్ అధికారులు పట్టించుకోలేదంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.