ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా సంయమనం పాటించి ఎటువంటి అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం. కృష్ణా జిల్లా పామర్రులో సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుం డా చూడాలన్నారు. అలాగే రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంయమనంతో మెలగాలని సూచించారు. అదేవిధంగా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, బాణసంచా పేలుళ్లు లాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడవద్దని ఎస్పీ హెచ్చరించారు. అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ అద్నాన్ నయీం కోరారు.


