దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని అన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు. కులగణన విషయంలో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెళ్తామని చెప్పారు. వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి
కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ హాల్‌లో 2 గంటల పాటు మంత్రి వర్గం భేటీ జరిగింది. ఈ నివేదికలను మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలో పెట్టి ఆమోదించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చిట్ నిర్వహించారు. “ఈ రోజు దేశం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ నిర్ణయంతో ప్రధానిపై ఒత్తిడి పెరగనుంది. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుంది. 76 శాతం బీసీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుంది. భవిషత్‌లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి. సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదు.
మేము ఏ పని చేసినా బాధ్యతతో చేశాం. కెసిఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్త శుద్ధి లేదు….రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు కదా. 56% శాతం బీసీలు, ఎస్సీలు 17 % ఉన్నారు. 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. వర్గీకరణ జరగాలి అని ఎప్పటి నుంచో మాదిగ, మాలలు పోరాటం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ సర్వే జరిగినా ఇదే ప్రామాణికంగా తీసుకోవాలి. దేశ చరిత్రలో మొదటి సారి కులగణన చేసి చరిత్ర సృష్టించాము. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు, కమిషన్ నివేదిక, సబ్ కమిటీ నివేదిక సూచన ప్రకారం ముందుకు వెళ్తాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి కదా. రాకీయాల కోసం ఏదీ చేయడం లేదు. ఈ డాక్యుమెంట్ డెడికేషన్ కమిషన్ తీసుకొంటుంది. కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంటుంది”.. అని రేవంత్ రెడ్డి చెప్పారు.