స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు (E-Batteries) దేశంలోనే తయారవుతాయని చెప్పారు. గిగా కారిడార్‌లో భాగంగా హైదరాబాద్‌లోని జీఎంఆర్ (GMR) ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం జహీరాబాద్‌ను ఎంపిక చేశామని తెలిపారు. యువ నైపుణ్యాన్ని ఒడిసిపట్టడంలో టీఎస్‌ఐసీ (Tsic) కృషిచేస్తున్నదని వెల్లడించారు. పరిశోధన, డిజైన్, ఇంజినీరింగ్ రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉందని చెప్పారు. ప్రపంచానికి వ్యాక్సిన్ (Vaccine)రాజధానిగా హైదరాబాద్ నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న జయదేవ్ గల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు కొత్తదనం ఉండేలా అమరరాజా కృషి చేస్తున్నదని చెప్పారు. రెండు రోజుల క్రితం కోల్డ్‌చైన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. ఎనర్జీ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.