స్వతంత్ర, వెబ్ డెస్క్: ఈనెల 16వ తేదీన వార్డ్ కార్యాలయాలను జీహెచ్ఎంసీ ప్రారంభిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. జిహెచ్ఎంసిలో భారత రాష్ట్ర సమితి కార్పోరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వార్డు కార్యాలయాల ప్రారంభం చేస్తున్నామని, వీటి ద్వారా నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడుతున్న తీరుని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని వారికి మార్గదర్శనం చేశారు.
రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అందించాలన్న ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలను చేపట్టారని కేటీఆర్ తెలిపారు. ఈ ఆలోచన దృక్పథం లోంచి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ఇంటి ముందట నిలిపేందుకు ప్రయత్నం చేశామని తెలిపారు. నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ లు నవీన్ రావు ,శంబిపూర్ రాజు, మేయర్ విజయలక్ష్మి ఇతర సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.