కేసుల భయం కావొచ్చు.. పదవీ వ్యామోహం కావొచ్చు..వైసీపీ నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతటి వాడైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడటం వైసీపీకి కోలుకోలేని దెబ్బే. అయితే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఇటీవల వైసీపీలోకి పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ నుంచి క్యూ కడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. మాజీ మంత్రి శైలజానాథ్ ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఇందుకు బలం చేకూరింది. తాజాగా వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేరతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై వైసీపీ నాయకులు ఏమంటున్నారు?.. ప్రచారంలో నిజమెంత..?
ప్రస్తుతం చెడిపోయిన రాజకీయాల్లోకి తన లాంటి వాళ్లు వచ్చి మనుగడ సాగించడం కష్టమని ఉండవల్లి సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. అంటే ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారంలో నిజం లేదన్నమాట.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉండవల్లి అత్యంత సన్నిహితుడు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్స్ లో అవకతవకలు జరిగాయంటూ కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తున్న నాయకుడిగా ఉండవల్లికి ప్రత్యేక గుర్తింపు ఉన్నమాట వాస్తవం.
నిజానికి ఈ కేసులో ఉండవల్లికి ఎలాంటి సపోర్ట్ లేదు. రామోజీరావు చనిపోయినా.. కేసు మాత్రం ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ఎవరి అండదండలు లేకపోయినా ఉండవల్లి మాత్రం పోరాటం ఆపలేదు. ఆయనకున్న ఏకైక ఆయుధం ఆర్ బీఐ నిబంధనలు. వీటి ఆధారంగానే ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.