ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నా.. అప్పుడే పొలిటికల్ హీట్ తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఓటర్ల జాబితా విషయంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలోని ఓటర్ల జాబితాను తనిఖీ చేయించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ విజ్ఞప్తి చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. గతంలో ఓట్లు తొలగించిన ఘనత తెలుగుదేశానిదే అంటూ కౌంటరిచ్చింది వైసీపీ.
రాష్ట్రంలో మరోసారి తిరుగులేని విజయం కోసం వైసీపీ.. గత ఎన్నికల్లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీడీపీ..ఎవరికి వారే తమదైన వ్యూహాలు రచిస్తున్నారు. అమలు చేస్తున్నారు. దీంతో..ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయం ఉన్నా ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ వేడి రగులుతోంది.
ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ. అధికారులను ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వడం లేదంటూ ఫిర్యాదు చేసింది. కేంద్ర సర్వీసు అధికారులతో ప్రతి జిల్లాలోని ఓటర్ల జాబితాను క్షుణ్నంగా తనిఖీ చేయించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల అధికారుల వద్ద 10 లక్షలా 27 వేల 507 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసిన టీడీపీ నేతలు దీనిపై గతంలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
అంతేకాదు.. బూత్ స్థాయి అధికారులు, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు తెలుగు దేశం నేతలు. ఓటర్ల జాబితా సవరణ, పర్యవేక్షణ కోసం ఉన్నత స్థాయి కమిటీ నియమించి ఇప్పటివరకు నమోదైన ఫిర్యాదులను పరిశీలించే బాధ్యత సంబంధిత కొత్త కమిటీకి అప్పగించాలని కోరారు. అలాగే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తొలగించడం సరైన చర్య కాదంటూ చెప్పుకొచ్చారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బాబు షూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ పథకం గురించి ప్రజలకు వివరిస్తే అది డేటా చౌర్యం ఎలా అవుతుందన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేస్తోందే అసలైన డేటా చౌర్యం అంటూ ఆరోపించారాయన.
ఇక, టీడీపీ నేతల ఢిల్లీ టూర్‌పై తనదైన శైలిలో కౌంటరిచ్చింది వైసీపీ. పచ్చదొంగల ముఠా ఊళ్ల మీద పడుతోందని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఐదు కోట్ల మంది సమాచారాన్ని టీడీపీ సేకరించిందని ఆరోపించిన ఆయన.. ఓటర్ కార్డు తీసుకొని పౌరుల వ్యక్తిగత గోప్యతలోకి చొరబడుతున్నారని ఫైరయ్యారు. గతంలో సేవామిత్ర యాప్‌తో 50 లక్షల ఓట్లు తొలగించిన చరిత్ర టీడీపీదని విమర్శలు గుప్పించారు సజ్జల.
కేంద్ర ఎన్నికల సంఘం తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిందని చెబుతోంది టీడీపీ. మరి..ఈ నేపథ్యంలో సీఈసీ.. ఏపీలో ఓటర్ల జాబితా అవకతవకలు, అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.