ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ జైలుకు వచ్చి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారు. ఇవాళ ఆయన వంశీని కలుస్తారని ముందు నుంచే ప్రచారం జరిగింది. వంశీని ఎస్సీ/ఎస్టీ కిడ్నాప్ కేసులో అరెస్టు చేసి, విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు రిమాండ్ విధించిన కొన్ని రోజుల తర్వాత కలవడం జరిగింది.
ఈ సందర్భంగా.. జగన్ జైలుకు వెళ్లి వంశీని కలవడాన్ని వ్యంగ్యంగా, ఎగతాళి చేస్తూ ఈనాడు ఒక కార్టూన్‌ను రూపొందించింది. ” సారుని ఇలా కలవాలంటే కుదరదు! ఏ అక్రమాలో.. అరాచకాలో చేసి జైలుకెళ్లు. ఆయనే వచ్చి పరామర్శిస్తారు!” అని కార్టూన్ గీశారు. ఈ కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
వైసీపీ అధినేత జగన్‌ను ఆ పార్టీ నేతలు కలవాలంటే నేరాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడమే ఏకైక మార్గమని అర్ధం వచ్చేలా కార్టూన్ ప్రచురించారు. అప్పుడే జైలులో వారిని కలవడానికి జగన్ జైలుకు వస్తాడని సెటైర్లు వేశారు.
జగన్ తన పార్టీ నాయకులను సాధారణ పరిస్థితుల్లో కలవడానికి ఇష్టపడరని, కానీ జైలుకు వెళ్లినప్పుడల్లా వారిని కలవడానికి ధైర్యం చేస్తారని..ఈ కార్టూన్ చెప్పకనే చెబుతోంది. జగన్ విజయవాడ జైలును సందర్శిస్తున్న సందర్భంలో గీసిన కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.