హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ దివంగత నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీలో క్రియాశీలక నాయకుడిగా ఉన్న విక్రమ్ గౌడ్ అక్కడ తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి దూరమైన విక్రమ్ గౌడ్ త్వరలోనే సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్‌తో విక్రమ్ గౌడ్ భేటీ అయ్యారు. తన తండ్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోసం మంత్రిని కలిసినట్లు ముఖేష్ గౌడ్ చెప్పారు. అయితే మంత్రి పొన్నంతో పార్టీలో చేరికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ నుంచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. బలమైన సామాజిక వర్గం కావడం, ఆర్థికంగానూ బలంగాను ఉండటం వల్ల ముఖేష్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కచ్చితంగా ఉందని అంటున్నారు.


