సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో ఏకంగా 3 నెలల జైలు శిక్ష పడింది. అది కూడా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ కోర్టు ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా వర్మ పై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. అయితే.. ఆ కేసులో ఏనాడూ వర్మ కోర్టుకు హాజరైన దాఖలానే లేదట. కోర్టులను లైట్ తీసుకున్న వర్మ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసిన అంధేరీ కోర్టు వర్మ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
అంతే కాకుండా విచారణకు హాజరు కాని వర్మకు 3 నెలల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల పరిహారం చెల్లించాలని వర్మకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిహారం చెల్లించని పక్షంలో మరో 3 నెలల పాటు జైలు జీవితం గడపాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో వర్మ ఉరుకులు పరుగులు పెట్టక తప్పదు. మునుపటి మాదిరిగా ఇప్పుడూ లైట్ తీసుకుంటే మాత్రం ఆయన తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.