ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూకి చెందిన ఓ విద్యార్థి అద్భుత ప్రతిభ చాటుతున్నాడు. 12 ఏళ్ళ వయసులోనే ఇంటర్ పూర్తి చేసి అబ్బురపరుస్తున్నాడు. సాధారణంగా ఇంటర్ కంప్లీట్ చేయాలంటే కనీసం 17 సంవత్సరాలు ఉండాలి.. కానీ ఈ విద్యార్థి 12ఏళ్లకే ఇంటర్ పాసై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఏడు, ఎనిమిది తరగతుల్లో ఉండాల్సిన వయసులో ఇంటర్ పాసవ్వటం గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షా ఫలితాలను యూపీ విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అతి తక్కువ వయసులో ఇంటర్మీడియట్ను పూర్తి చేసి ఆదిత్య శ్రీకృష్ణ(12) రికార్డు నెలకొల్పాడు.
ఎల్డెకో ఉద్యాన్ II కళాశాల ద్వారా పరీక్షలు రాసిన ఆదిత్య 54.4% ఉత్తీర్ణతతో పాసయ్యాడు.ఆదిత్య కాలేజీకి వెళ్లి కాకుండా.. ఇంట్లో ఉండే పరీక్షలకు సిద్దమవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే రాష్ట్రం నుంచి అతిచిన్న వయసులో(13 ఏళ్లకే) సుష్మా వర్మ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేయగా… ప్రస్తుతం ఈ రికార్డును ఆదిత్య శ్రీకృష్ణ బ్రేక్ చేశాడు. అయితే ఆదిత్య శ్రీకృష్ణ మాత్రం.. భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది తన లక్ష్యమని తెలుపుతున్నారు. ప్రస్తుతం దీనికోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. తనకు ఎకానమిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమని… అలాగే ఆర్థిక పరమైన అంశాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతానన్నారు.