స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లో తనకంటే సీనియర్ అని అలాంటి వ్యక్తి నేడు ఊసరవెల్లి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరంలో నారా లోకేశ్ క్యాంపు సైట్ వద్ద అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ కేసును సీబీఐతో విచారించాలని హైకోర్టులో ఉండవల్లి కేసు వేయడంపై మండిపడ్డారు.
అసలు ఆ కేసులో ఏమైనా పస ఉందా? ఆ కేసుకు సంబంధించిన ఒక్క ఆధారమైనా ఉందా? డబ్బులు ఏదైనా చంద్రబాబు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వెళ్లినట్లు ఆధారం ఉందా? అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. చంద్రబాబును బయట తిరగనివ్వకూడదనే దురుద్దేశంతో జగన్ కుట్రలు పన్నుతుంటే… దానికి ఉండవల్లి సహకరిస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో కథలు చెప్పావ్…నేటి పాలనపై ఒక్కసారి అయినా మాట్లాడావా? జగన్ రెడ్డి వైఫల్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.