స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తుని రైలు దహనం ఘటన కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. కాపునేత ముద్రగడ పద్మనాభంతో సహా మొత్తం 41మందిపై నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కేసు విచారణ సందర్భంగా ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా కోర్టు ఎదుట హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును వెల్లడిస్తూ నిర్ణయం తీసుకుంది. తీర్పు సందర్భంగా ముగ్గురు రైల్వే అధికారులపై అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన ఈ అంశాన్ని ఏడేళ్ల పాటు ఎందుకు సాగదీశారని ప్రశ్నించింది. ఇందుకు బాధ్యులైన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 2016 జనవరిలో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తునిలో కాపు సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేయగా.. వైసీపీ ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది.