స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే చిరుత బోనులో చిక్కింది. ఇక, మూడు రోజుల క్రితమే ఇక్కడ మరో చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించారు. పట్టుబడిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించారు.
ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి 1.30 గంటలకు చిరుత బోనులో చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్ధారించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటవీశాఖ అధికారుల సూచనలతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తాం’ అని స్పష్టం చేశారు.