ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఢిల్లీతోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని సీపీ ఔటర్ సర్కిల్, మోతీబాగ్, రింగ్ రోడ్ ప్రాంతాల్లో.. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు నిలవడంతో..భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, హిమాచల్‌ప్రదేశ్ కులూ జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలీ-లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు. ఉత్తరాదిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది.
ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో ఎడతెరిపి లేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల సబ్‌వేల్లోకి నీళ్లు చేరాయి. గుజరాత్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. పోర్‌బందర్, సూరత్, జునాఘడ్ , వడోదర జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గుజరాత్‌లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది.