తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో టాలీవుడ్‌ను రాజకీయాల్లోకి లాగారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. వారి వ్యక్తి గత విషయాలను బహిరంగంగా మాట్లాడటంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం సహా సినీ పరిశ్రమలోని నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్కినేని నాగచైతన్య స్పందిస్తూ.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం..హాస్యాస్పదమే కాకుండా.. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటని నాగచైతన్య పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మరో నటుడు నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా అంటూ ప్రకాశం రాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండించాలన్నారు కోన వెంకట్. అలాగే కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరం, హేయంగా ఉన్నాయని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం, ఇటు సమంత ఖండించారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల కోరారు. రాజకీయాల కోసం తమ జీవితాలతో ఆడుకుంటారా అంటూ అక్కినేని నాగార్జున ఫైరయ్యారు. కొండా సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. కొండా సురేఖ .. దెయ్యం పట్టినట్టుగా రాక్షసంగా మాట్లాడారని నాగార్జున భార్య అక్కినేని అమల మండిపడ్డారు. సురేఖతో క్షమాపణ చెప్పించాలంటూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు.
తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని.. ఇలాంటి గ్లామర్ పరిశ్రమలో రాణించాలంటే శక్తి కావాలని అన్నారు సమంత. విడాకులు తన వ్యక్తిగత విషయమని అన్నారు. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని చెప్పారు. విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని అన్నారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని..తాను ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారని.. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు సమంత.