స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు చరిత్రను సృష్టించాయి. సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 63,523కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 18,857 వద్ద స్థిరపడింది. 2022 డిసెంబర్ 1న సెన్సెక్స్ 63,583 పాయింట్లను నమోదు చేసింది. ఈనాటి మార్నింగ్ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 63,588 పాయింట్లను టచ్ చేసింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లలో జోష్ ను నింపాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దలాల్ స్ట్రీట్‌లో 9 బిలియన్ల డాలర్ల బలమైన వాలెట్‌ను ప్రారంభించడంతో, సెన్సెక్స్ రికార్డు స్థాయిని టచ్ చేసింది. దాదాపు 137 రోజుల తరువాత ఆల్‌టైం హైని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, విప్రో, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. మరోవైపు దేశీయంగా ఉన్న సానుకూల సంకేతాలూ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.03 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి.


