స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 16 లక్షల మందికి ఫుడ్ పాయిజనింగ్ అవుతోందని, ఆహారం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లతో రోజుకు ఐదేళ్లలోపు పిల్లలు 340 మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఏటా జూన్ 7న ప్రపంచ ‘‘ఫుడ్ సేఫ్టీ డే’’గా డబ్ల్యూహెచ్వో నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తరచూ ఫుడ్ పాయిజనింగ్కు కారణమయ్యే ఆహార పదార్థాలు ఏమిటి, ఆహారం నుంచి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లాంటి వివరాలు చూద్దాం.
> సరిగ్గా వండని లేదా పచ్చి మాంసం, సరిగ్గా కడగని కూరగాయలు, పచ్చి పాలు, ఇతర పాల ఉత్పత్తులు, ఎక్కువకాలం నిల్వ ఉంచిన గుడ్లు, సరిగ్గా శుభ్రంచేయని చేపలు, అపరిశుభ్రమైన మొలకలు, ఎక్కువ నిల్వచేసిన పిండి లాంటి వాటివల్ల ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీపీ) చెబుతోంది.
> పచ్చి మాంసం లేదా సరిగ్గా వండని మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే ‘‘ఫుడ్ పాయిజనింగ్’’ అయ్యే అవకాశం ఎక్కువ. వీటిలో కంపిలోబ్యాక్టర్గా పిలిచే బ్యాక్టీరియా ఉంటుంది. ఒక్కోసారి సాల్మనెల్లా, క్లస్ట్రీడియమ్ పెర్ఫ్రింజెన్స్, సాల్మొనెల్లా, ఈ.కోలై లాంటి సూక్ష్మజీవులు కూడా ఉండొచ్చు. ‘‘మాంసం సరిగా వండకపోతే చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే పూర్తిగా వండిన తర్వాతే మంసాన్ని తీసుకోవాలి’’ అని నిపుణులు తెలుపుతున్నారు.
> తాజా పచ్చి కూరగాయలు, ఆకుకూరలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ, ఒక్కోసారి ఇవి ఫుడ్ పాయిజనింగ్తోపాటు ఇన్ఫెక్షన్లకూ కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కూరగాయల్లో ఒక్కోసారి సాల్మనెల్లా, ఈ.కోలై, లిస్టీరియా లాంటి సూక్ష్మజీవులు ఉండొచ్చు. పొలం నుంచి మన ఇంటికి వచ్చే మధ్యలో ఎక్కడైనా ఇవి కలుషితం కావచ్చు. ఒక్కోసారి మన వంటగదిలోని ఇతర పదార్థాల వల్లా ఇవి సూక్ష్మజీవులతో కలుషితం కావచ్చు. అందుకే వీటిని జాగ్రత్తగా శుభ్రంచేసిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి.
>ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన గోధుమ పిండిలోనూ సుక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పిండిని పచ్చిగా తినొద్దని సీడీసీపీ సూచిస్తోంది.
>పచ్చి చేపల్లో బ్యాక్టీరియాతోపాటు కొన్ని వైరస్లు కూడా ఉండొచ్చు. వీటి వల్ల అనారోగ్యంతోపాటు మరణానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఉంటుంది. అందుకే చేపలను బాగా శుభ్రంచేసిన తర్వాత వండుకొని తినాలని సీడీసీపీ సూచిస్తోంది.
>పచ్చి గుడ్లలో సాల్మనెల్లా ఉండొచ్చు. చూడటానికి శుభ్రంగా, ఎక్కడా పగిలినట్లులేని గుడ్లలోనూ ఈ సూక్ష్మజీవులు ఉండొచ్చు. అందుకే పాశ్చురైజేషన్ చేసిన లేదా ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటే మంచిది. గుడ్లలోని తెల్ల, పచ్చని సొనలను గట్టిపడే వరకూ ఉడకబెట్టాలని సీడీసీపీ చెబుతోంది.


