తెలుగు రాష్ట్రాల్లో మహా సంగ్రామం ముగిసింది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో కన్నా ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. దీంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ లపై నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు.అటు తెలంగాణలోనూ ఎన్నికల సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించు కున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగిసినా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిం చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. ఓటరు తీర్పు ఎటు వైపు ఉన్నదో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనున్నది. ఫలితాలపై అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ తప్పని పరిస్థితి నెలకొంది. పోలింగ్ ముగియగానే ఎన్నికల ఏజెంట్లు, అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీలు చేశారు. వాటిని కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు రాత్రికి రాత్రే తరలించి.. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. లెక్కింపు కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద్ద మూడంచెల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు.