ఆరుగురు ప్రాణాలు పోవటానికి కారకులు ఎవరు?.. అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో ఈ ముగ్గురూ టీడీపీకి సేవ చేసే పనిలో మాత్రమే ఉన్నారని ఆరోపించారు. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. వీరు వచ్చినప్పటి నుండి కొండ మీద అన్నీ వివాదాలే .. అని అన్నారు
వైఎస్ జగన్ కొండ మీదకు వస్తున్నారనగానే బోర్డులు పెట్టారు. జగన్ రావటంలేదు అనగానే ఆ బోర్డులు తీసేశారు. బీఆర్ నాయుడుకి దేవుడి మీద భక్తి లేదు. మా మీద పూర్తిగా విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు. కొండ మీద రాజకీయాలు చేసి జగన్‌ని అడ్డుకునే ప్రయత్నాలే చేశారు. కొండ మీద పాపాలు, ద్వేషాలు కొనసాగితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.
ఏడుకొండల్ని పవిత్రంగా చూడండి. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఏం చెప్తారు?. పీఠాధిపతులు, స్వామీజీలు బయటకు వచ్చి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. ఎస్పీ సుబ్బారాయుడు తెలుగు దేశం సేవలో ఉన్నారు. అఘాయిత్యానికి గురైన బాలికను పరామర్శించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద ఫోక్సో కేసు పెట్టిన ఘనుడు ఎస్పీ.
ఎంతసేపటికీ వైసీపి నేతలను వేధించటమే పనిగా పెట్టుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోకపోతే వారి ఆత్మలు శాంతించవు. కేసులు కూడా ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. ప్రతిదానికీ అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కింద నమోదు చేస్తున్నారు. వైసీపీ వీటిని చూస్తూ ఊరుకోదు.. అని అంబటి రాంబాబు అన్నారు.