అసాధ్యం అన్న రుణ మాఫీని సుసాధ్యం చేస్తూ…. తెలంగాణ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో లక్ష రూపాయల వరకు… రుణమాఫి చేసి… రుణమాఫికి శ్రీకారం చుట్టారు. ఈ నెల చివరకు లక్షన్నర, పంద్రాగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీకి సర్కారు సిద్ధమైంది. అసలు సాధ్యం కాదనుకున్న రుణమాఫిని అమలుచేసి… ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో అప్పులతో ఖజానా ఖాళీగా ఉన్నా… ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫి చేశారు సీఎం రేవంత్. అదికూడా… పంద్రాగస్టు డెడ్ లైన్ కంటే ముందే రుణామాఫికి శ్రీకారం చుట్టి… కాంగ్రెస్ సర్కార్ కొత్త చరిత్రకు నాంది పలికింది. గతంలో యుపీఏ సర్కార్ లో దేశ వ్యాప్తంగా 71 వేల కోట్ల రుణమాఫిని ఏక కాలం లో చేస్తే… ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 31 వేల కోట్ల రుణమాఫి చేసి…తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని సీఎం రేవంత్ చాటుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి 6వేల 98 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. దీంతో తొలి విడతలో లక్ష వరకు రుణం తీసుకున్న 11.08 లక్షల మంది రైతులకు లబ్ది కలిగినట్లు అయ్యింది. ఈ నెలఖారులోగా లక్షన్నర, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. రుణమాఫీ పథకం ప్రారంభం అనంతరం రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులతో రేవంత్ మాట్లాడారు. ఇదో అద్భుత కార్యక్రమం, జీవితంలో మరిచిపోలేని రోజని… దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశం తనకు ఇచ్చారని రేవంత్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అవుతుందని రుజువు చేశామని అన్నారు. మంత్రుల, అధికారుల సహకారంలో రుణమాఫీ చేశామని వెల్లడించారు. రైతు రుణ మాఫీ ప్రారంభం కావడంతో గాంధీ భవన్ లో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు.