వరంగల్‌కు ఉగ్రలింకుల ఊహాగానాలకు చెక్ పడింది. ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న వరంగల్ వాసిని అధికారులు వదిలేశారు. శ్రీలంకకు వెళ్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో వరంగల్‌కు చెందిన జకారియాను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు జకారియాను విచారించారు. అనంతరం గురువారం ఆయనను విడిచిపెట్టారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు జకారియాను వదిలేశారు. అయితే తాను ఎంత చెప్పినా తనపై ఉగ్రవాద ముద్ర వేశారని జకారియా ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సంస్థకు చెందిన పనుల కోసం శ్రీలంక వెళ్తుండగా.. అనుమానంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తనను వదిలేశారని.. తనపై ఎలాంటి మచ్చ లేదని తెలుసుకున్న తర్వాతే వదిలిపెట్టారని మీడియాతో చెప్పాడు. అయితే తాను ఉగ్రవాదినంటూ వార్తలు ప్రసారం చేయడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
జానిపీరీలకు చెందిన జకారియాకు పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా వరంగల్ లో ఉంటూ హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద కొంతకాలంగా బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. శ్రీలంక వెళ్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో జకారియాను అదుపులోకి తీసుకున్నారు. జనవరి 25న ఈ ఘటన జరిగింది. వరంగల్‌లో ఉంటున్న జకారియా విజయవాడకు చెందిన మరో ఇద్దరితో కలిసి శ్రీలంక వెళ్తుండగా ఏఐ ఫేస్ రికగ్నిషన్ స్కానర్ జకారియాపై అనుమానం వ్యక్తం చేసి అధికారులను అలర్ట్ చేసింది. ఎన్‌ఐఏ అధికారులు విచారణ అనంతరం గురువారం జకారియాను వదిలిపెట్టారు.