ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో, అల్లర్లు చెలరేగకుం డా కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్‌పై వేటు వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో సంబంధిత అధికారులను బాధ్యులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడంతో సీఈసీ ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు, ఫలితాలు వెలువడిన రెండు వారాల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి.
క్షణక్షణం భయం భయం. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. ఎవరిపై ఎవరు దాడులు చేస్తారోనన్న ఆందోళన. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ.. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి. ఇలా చెప్పుకుంటూ వెళితే పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ వాతావ రణం నెలకొంది. కారణాలు ఏవైనా పోలింగ్ సందర్భంగా, ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా రాళ్లు రువ్వుకోవడమే కాదు.. వాహనాల ధ్వంసం, నేతలపై దాడులతో బయటకు రావాలంటేనే భయం. భయం అనే పరిస్థితులు పలుచోట్ల తలెత్తాయి. అయితే, ఈ దాడులు, విధ్వంసాలు, ఉద్రిక్త పరిస్థితులకు కారణం, కారకులు మీరంటే మీరంటూ ఏపీలోని అధికార, విపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. తప్పు మీదంటే మీదంటూ, ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తులు సైతం చేశారు.
పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని చోట్ల జరిగిన ఘర్షణలు, అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఏపీ సీఎస్‌తోపాటు డీజీపీ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో హస్తిన వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఈసీ రాజీవ్ కుమార్, కమీషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుల ముందు హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వీరికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన హింసకు, అల్లర్లకు బాధ్యులెవరు ? రాష్ట్రంలో 14 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినా అక్కడ అల్లర్లు జరిగే అవకాశాలుంటాయని హెచ్చరించనా, వాటిని అరికట్టే విషయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ? లాంటి ప్రశ్నలు సంధించి సీఎస్, డీజీపీ నుంచి వివరాలు సేకరించారు.
ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి తీసుకున్న వివరాలు పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు సంబంధించి మొత్తం 16 మంది అధికారులపై కొరడా ఝుళిపించింది. బదిలీ వేటు పడిన వారిలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఉన్నారు. అలాగే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేసింది. వేటు పడిన వారిలో.. ఒక కలెక్టర్, ముగ్గురు ఎస్పీలతోపాటు పల్నాడు జిల్లాకు చెందిన గురజాల డీఎస్పీ పల్లపురాజు, నర్సరావుపేట డీఎస్పీ వీఎస్‌ఎన్ వర్మ ఉన్నారు. అనంతపురం జిల్లా విషయానికి వస్తే తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, తిరుపతి జిల్లాను చూస్తే, తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డితోపాటు మూడు జిల్లాలకు చెందిన ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్‌ఐలు ఉన్నారు. ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఈ పదహారు మందిపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించిందీ సీఈసీ. అంతేకాదు, వారిపై ఛార్జ్ షీట్ వేయాలని స్పష్టం చేసింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, తదుపరి చర్యల కోసం సిఫార్సులతో కూడిన నివేదికను ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. అసలు తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తి వేయొద్దని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయొద్దని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. మరోవైపు ఫలితాల అనంతరం కూడా పలు చోట్ల హింస చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాలు వెలువడిన రెండు వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను సైతం ఆదేశించింది సీఈసీ.