తెలంగాణలో నామినేషన్ ముగింపునకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్‌లో టికెట్ పంచాయితీ కొలిక్కి రావపోవడానికి కారణమేంటి..? ఖమ్మం అభ్యర్థి ప్రకటనపై హైదరాబాద్ హైకమాండ్ చేతులెత్తే సిందా..? బెంగళూరు వేదికగా జరుగుతున్న మంతనాలేంటి..? ఇకనైనా టికెట్ పంచాయితీ ఓ కొలిక్కి వస్తుందా..? సస్పెన్స్‌కు తెరపడుతుందా.?
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా, ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నా.. నామినేషన్ ముగింపనకు గడువు దగ్గరపడుతున్నా కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన ఇప్పటికీ పూర్తికాలేదు. పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ప్రకటనపై తెలంగాణ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. ఇక ఇప్పటి వరకు అభ్యర్థు లను ప్రకటించిన పార్లమెంట్ నియోజకవర్గాలలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించి.. సుడిగాలి పర్యటనలతో, నామినేషన్ కార్యక్రమాలు బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు కోసం అభ్యర్థులతోపాటు సీనియర్ నేతలు దూకుడుగా వ్యవహిరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరినిని సముదాయించలేక, ఎవరూ మాట వినే పరిస్థితి లేక టీపీసీసీ చేతులెత్తేసింది. మరోవైపు ఖమ్మం సీటు కోసం మంత్రులిద్దరూ పోటీ పడుతు న్నారు. ఎవరికెవరూ తగ్గడం లేదు. ఈ విషయంలో వేలు పెడితే ఇబ్బందులు తప్పవని, మొదటికే మోసం వస్తుందని భావించిన సీఎం రేవంత్.. తాను జోక్యం చేసుకోలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు చేరింది.
ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇరు నేతలు. పొంగు లేటి ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికే సీటు కావాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తుండగా, భట్టి తన భార్య నందినికైనా, లేదంటే రాయల నాగేశ్వరరావు కైనా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వద్దకు ఖమ్మం సీటు పంచాయితీ వెళ్లింది. ఖర్గే సమక్షంలో బెంగుళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్ మీద మంతనాలు జరుగుతున్నాయి.
ఖమ్మంలో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో దింపితే, కరీంనగర్‌లో క్వైట్ అపోజిట్.. లేదా ఇతర సామాజికవర్గానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే, మరొకటి వెలమ సామాజికవర్గానికి కేటాయించాలన్న యోచనలో ఉంది. మరోవైపు కరీంనగర్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం వెలిచాల రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డిలు ప్రధానంగా పోటీ పడుతుండ గా.. టికెట్ ఇవ్వకుండానే వెలిచాల నామినేషన్ వేసి ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే ఆయన నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు జిల్లా నేతలతో కలిసి ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగిందా లేదంటే పార్టీలో ఏదైనా ముసలం కొనసాగు తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక పోతే హైదరాబాద్ పార్లమెంట్ కి హైదరాబాద్ DCC అధ్యక్షులు సమీరుల్ల ఖాన్ పేరు వినిపిస్తుంది. ఓవైపు ఎన్నికల జాతర జోరుగా కొనసాగుతున్న వేళ.. ఇప్పటికీ కాంగ్రెస్ పెండింగ్ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ల క్యాడర్ అయోమయంలో పడింది. మొత్తం మీద ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారు..?, పై చేయి ఎవరిదవుతుంది..? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.


