చిన్న వయసు.. అప్పుడే నూరేళ్లు నిండిపోతుంటే కన్నవారు పడే బాధ చెప్పలేనిది. డ్యాన్స్ చేస్తూ.. వ్యాయామం చేస్తూ.. నడుస్తూనే.. కళ్ల ముందే కుప్పకూలిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. ఉరుకులు పరుగుల జీవితం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే తనువు చాలిస్తున్నారు. ఇలాంటి చావులు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది.
23 ఏళ్లే ఉంటాయి ఆ యువతికి. బంధువుల పెళ్లిలో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి బాధ అంతా ఇంతా కాదు. మధ్యప్రదేశ్ లోని విధిష జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఆ యువతి పేరు పరిణీతా జైన్. ఆమె తన సోదరి వివాహానికి ఇందోర్ నుంచి విదిష జిల్లాలోని ఓ రిసార్ట్ కు వచ్చింది. హల్ది ఫంక్షన్ కి 200ల మంది అతిథులు వచ్చారు. పరిణీతా జైన్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హిందీ పాట లెహరా కే బల్ఖాకే పాటకు ఆమె డ్యాన్స్ చేస్తుండగా స్టేజ్ మీదే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది చూసిన ఆమె కుటుంబ సభ్యులు, అక్కడికి వచ్చిన అతిథులకు అసలు ఏం జరిగిందో అర్ధం కాలేదు. కాసేపు షాక్ లో ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కుటుంబ సభ్యులలోని కొందరు డాక్టర్లు.. ఆమెకు సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె స్పందించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.
పరిణీత .. ఎంబీఏ పూర్తి చేసింది. ఇండోర్ లోని సౌత్ తూకోగంజ్ లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం.. గతంలో ఆమె తమ్ముడు కూడా 12 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందినట్టు తెలుస్తోంది.
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఘటనలు మధ్య ప్రదేశ్ లో ఇది మొదటిది కాదు. గతేడాది అక్టోబర్ లో అగర్ మాల్వా జిల్లాలో 15 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతుండగా కార్డియాక్ అరెస్టుతో చనిపోయాడు.
మధ్యప్రదేశ్ ఇండోర్ లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న 73 ఏళ్ల వ్యక్తి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మరణించాడు.