స్వతంత్ర వెబ్ డెస్క్: ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొక్కరు ప్రతిపక్ష నేత. ఇద్దరి మధ్య నిత్యం మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతోన్న తరుణంలో వీరిద్దరి మధ్య మాటలు తూటాలపై పేలుతున్నాయి. ఈ సమయంలో ఇద్దరు నాయకులు ఒకే చోట ఉండడం ఆసక్తిగా మారింది. గోదావరి జిల్లాలో హైఓల్టేజ్ పొలిటికల్ హీట్ కనిపిస్తోంది.
వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు సోమవారం సీఎం జగన్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పోలవం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరి పర్యటనలు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు ఒకే జిల్లాలో పర్యటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఉదయం ముమ్మిడివరం మండలం గురజపులంక వెళ్లనున్నారు. అక్కడ ముంపు బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం తానేలంక, తోటరాముడిపేట వరద బాధితులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఇక మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఈ రోజు పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్‌ను పరిశీలించనున్నారు. కోరుకొండలో రోడ్ షో, బస్టాండ్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరి నువ్వా, నేనా అన్నట్లు సాగుతోన్న ఇద్దరి నాయకుల పర్యటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి.