నైరుతీ రుతుపవనాల కారణంగా తెలంగాణాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొన్ని సార్లు ఆస్తి నష్టం జరుగుతుంది. మరోవైపు నాలాలు మనుషుల ప్రాణాల్ని మింగేస్తున్నాయి. వర్షాల సమయంలో జరిగే ప్రమాదాలకు అధికారులు చెక్ పెడతారా..?
భారీ వర్షాలు హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కాగా గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. గ్రేటర్‌లో చిన్నపాటి వర్షానికే కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. అనేక ప్రాంతాలు తటాకాల ను తలపిస్తాయి. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ఏ పక్క ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని జనాలు భయపడుతున్నారు. భారీ వర్షాలకు నాళాలు తెరచి ఉండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
గ్రేటర్ సిటీలో గంట సమయంలో 2సెంటిమీటర్ల వర్షం పడిందంటే చాలు ఇక అంతే సంగతులు. ఎక్కడ రోడ్డు ఉందో ఏ నాళ ఎక్కడుందో తెలియని పరిస్థితి. భారీ వర్షం వచ్చిన ప్రతీసారి నగరంలో ఎదో ఒక చోట మృత్యుఒడికి చేరుతు న్నారు. కొన్నేళ్లుగా నాలాలు జనాన్ని మింగేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం చిలకలగూడ వద్ద నిండు గర్భిణి నాలాలో పడి మృతి చెందింది. మూడునాలుగేళ్ల క్రితం మల్కాజ్ గిరి ప్రాంతంలో ఓ చిన్నారి నాలాలో కోట్టుకుపోయింది. సరూర్ నగర్ వద్ద నవీన్ వ్యక్తి నాళాలో కోట్టుకుపోయి మృతి చెందారు. హిమాయత్ నగర్‌లో ఒక వ్యక్తి సికింద్రాబాద్ కలాసిగూడ వద్ద చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందారు. మూడు వారాల క్రితం కురిసిన వర్షాలతో బేగంపేట్ ఓల్డ్ కష్టమ్స్ బస్తీ వద్ద నాలాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీటన్నింటికి బల్దియా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలున్నాయి.సిటీలో బల్దియా అధికారులు వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి జనాలు మృత్యు వాత పడుతున్నారు.
ఈ ఏడాది వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికా రులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఉన్నతాధికారులు, జీహెచ్ఎం సీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను హెచ్చరించింది. దీంతో వాటర్ బోర్డు, జీహెచ్‌ఎంసీ సంస్థలు వర్షాకాలంలో జనాల భద్రతపై ఫోకస్ చేశాయి. నగరంలో వర్షం నీటి నాలాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వేగంగా పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు నాళాలకు ఫెన్సింగ్ పనులు పాడైన మ్యాన్ హోల్స్ రిపేర్లు కంప్లీట్ అయితే ప్రమాదాలకు తావు ఉండదు. ఇక సిటీలోని నాళాలపై స్పెషల్ పోకస్ పెట్టాలి. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో మాత్రం తప్పని సరిగా ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతే కాకుండా నాళా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.