నల్లగొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. నేటితో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వానికి తెర పడనుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్మాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా, బీజేపీ మాత్రం ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.. స్వతంత్ర అభ్యర్థుల బక్క జడ్సన్, పాలకూరి అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4.61లక్షల మంది ఓటరు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు శ్రమిస్తున్నారు.మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అయితే, గత ఏడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధిక సంఖ్యంలో ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్.. అదే ఊపులో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో ఉంది.52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన పోటీ BRS, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు తమ అభ్యర్థులను వెంకటేసుకుని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మూడు జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ నుంచి మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థిని కలుపుకొని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తోంది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వాగ్థానాలను గట్టున పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ అనివార్యంగా జవాబులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రచారం చేస్తోంది.ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్నను నిలబెట్టింది. మల్లన్నను గెలిపించేందుకు పని చేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఆత్మీయ సమావేశాలే ప్రచార వేదికలుగా చేసుకున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమంటే, తమదే అన్న ధీమాలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు.


