మరి కొన్ని గంటల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరపడుతోంది. మైక్ లు మూగపోతాయి. అంతా.. నిశ్శబ్దం. మే 13న ఎన్నికలు. పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వేళ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ప్రచారంలో పరస్పర విమర్శలు ఆరోపణలు చేసుకు న్నాయి. అసలే మండు టెండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నవేళ ఎన్నికల ప్రచారంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యర్థులు ఇంటింటికి తిరిగారు. హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెం టీలు, 100 రోజుల్లో చేసిన అభివృద్ధి పనులు ఆగస్టు 15 నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని కాంట్రాక్టర్ల, కంపెనీల వద్ద మామూళ్లు వసూలు చేస్తూన్నారని, ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమె త్తారు. మోదీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ లో జాతీయ రహదారులు, రైల్వేలు ఇతరత్రా జరిగిన అభివృద్ధిని వివరించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు. రెండు జాతీయ పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ఎజెండాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఇస్తే, రాష్ట్రంలో కొత్త జిల్లాలను రద్దు చేస్తుం దని దుమ్మెత్తిపోశారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుందని ఆరోపించారు. ఇలా పరస్పరం ఆరోపణలు, ప్రత్యర్థి పార్టీలపై చేస్తున్న ఆరోపణల తో ప్రచార పర్వం సాగింది.