స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అనేక కారణాల చేత పెళ్లిళ్లు ఆగిపోవడం చూసుంటాం. కట్నం తక్కువ ఇచ్చారనో.. ప్రేమ వ్యవహారాల చేతనో.. ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతేనే పెళ్లిళ్లు ఆగిపోతాయి. కానీ ఇక్కడ కట్నం తర్వాత, తనకు కట్నం రూపేణా ఇస్తానన్న బైక్ ఇవ్వకపోవడంతో పెళ్లి ఆపేందుకు సిద్ధపడ్డాడు ఓ పెళ్ళికొడుకు. తీరా ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో నూతన వధూవరులు ఒక్కటయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
శంకరపట్నం మండలంలోని అంబాల్‌పూర్ గ్రామ మాజీ సర్పంచి గాజుల లచ్చమ్మ-మల్లయ్య ముద్దుల కుమార్తె అనూషకు… సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంగాల వినయ్‌తో పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయం చేసుకున్నారు. వరపూజ సమయంలో తనకు రూ .5 లక్షల కట్నంతో పాటు బండి కొనివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఒప్పుకున్న వధువు తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి పెళ్ళిలో రూ .5లక్షలు ముట్టజెప్పారు. బండి కొనివ్వడానికి కాస్త సాయం పడుతుందని వరుడితో అన్నారు. దీంతో ఆగ్రహించిన వినయ్.. నాకు ఇప్పుడు బండి ఇస్తేనే ఈ పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. దీంతో వధువు తల్లిదండులు తీవ్ర దుఖంలోకి వెళ్లారు.
శుక్రవారం శంకరపట్నంలో ఈ పెళ్ళికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. ఇదంతా గమనిస్తూ వధువు తల్లిదండ్రులను బాధపడద్దని ఓదార్చారు. బండికి కావలసిన డబ్బు తాను ఇస్తానని హామీ ఇచ్చారు. మొదటగా రూ.50 వేలు వధువుకు ఇచ్చి వరుడి చేతిలో పెట్టారు. అనంతరం మిగితా సొమ్మును షోరూంలో తానే కడుతానని హామీ ఇచ్చారు. దీంతో పెళ్ళికి ఒప్పుకున్న వరుడు.. వధువు మెడలో తాళి కట్టి వివాహం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ… వధువు తల్లిదండ్రులది నిరుపేద కుటుంబమని.. వారి బాధ చూడలేకనే ఈ ఆర్థిక సాయం చేశానని అన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం పట్ల పెళ్ళికి వచ్చిన పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.