రెండు రోజులు పేషెంట్ కు వైద్యం చేస్తున్నట్టు నటించి.. లక్షల్లో వసూలు చేసి.. చివరకు డెడ్ బాడీ అప్పగించిన ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ మియాపూర్ లోని సిద్ధార్థ ఆస్పత్రి ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. స్వతంత్ర టీవీలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు సిద్ధార్థ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ వో వేంకటేశ్వర రావు, పలువురు అధికారులు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
సుహాసిని (26) కళ్లు తిరిగిపోవడంతో కడపలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్ధార్థ న్యూరో ఆస్పత్రికి తీసుకొచ్చారు. లక్షా 25 వేల రూపాయలు కట్టించుకున్నారు. ఇంకా బ్యాలెన్స్ ఎమౌంట్ 5 లక్షలు కడితే ట్రీట్‌మెంట్ చేస్తామని.. సుహాసిని బతుకుతుందని బంధువులకు ఆస్పత్రి యాజమాన్యం నమ్మబలికింది. అయితే శనివారం బిల్ కట్టనవసరం లేదని.. తీసుకెళ్లి నిమ్స్‌లో జాయిన్ చేసుకోవాలని సుహాసిని కుటుంబ సభ్యులకు చెప్పారు.
దీంతో ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లి ఎమర్జెన్సీ వార్డులో చూపించగా.. అప్పటికే చనిపోయిందని.. అక్కడి వైద్యులు చెప్పడంతో వారు షాకయ్యారు. తిరిగి సుహాసిని డెడ్‌బాడీని సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకొచ్చి .. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్వతంత్ర టీవీ, వెబ్ సైట్ లో కథనాలు ప్రసారమయ్యాయి. డబ్బుల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టింది.