ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అంత్యక్రియలు శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో నిర్వహించారు. 21వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మరణించారు. చలపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఒడిశా సీపీఐ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. గెరిల్లా యుద్ధంలో చలపతికి మంచి పట్టు ఉంది.
చలపతిది చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ముత్యంపైపల్లి. చిత్తూరు జిల్లాలో డిగ్రీ వరకు చదువుకున్న చలపతి 1988లో పట్టు పరిశ్రమ శాఖలో ఫీల్డ్ ఫోర్‌మన్‌గా ఉద్యోగంలో చేరారు. విజయనగరంలో పట్టు పరిశ్రమ శాఖ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ప్రతాప్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే నాస్తికత్వం వైపు మళ్లారు. విజయనగరంలో ఉన్నప్పుడే రాడికల్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. అప్పటికి ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా…రాడికల్ విద్యార్థి సంఘ నిర్మాణంలో భాగమయ్యారు.
విజయనగరంలో పట్టు పరిశ్రమ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో… కార్యాలయంలోనే రాత్రివేళ విప్లవ కార్యకలాపాలు నిర్వహించేవారని చలపతి సన్నిహితులు చెబుతున్నారు. ప్రతాప్ విప్లవ కార్యక్రమాల్లో భాగమవుతున్నాడని తెలిసి ఆయన తల్లిదండ్రులు, అన్నయ్య విజయనగరం వచ్చి సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆయన వారి మాట వినలేదు. వారి నుంచి తప్పించుకుని బయటకు వెళ్లాడు. వెళ్లిన ప్రతాప్ రెడ్డి… మళ్లీ ఉద్యోగానికి తిరిగి రాలేదు. పూర్తిస్థాయి విప్లవ కారుడిగా మారిపోయారు.
శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో కీలకమైన ఉద్ధానం ఉద్యమ నిర్మాణంలో ఆయన భాగమయ్యారు. అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో ఆయన పేరు సుధాకర్. ఉద్యమ ప్రాంత ప్రజలంతా ఆయనను సుధాగా పిలుచుకునేవారు. పీపుల్స్‌వార్‌లో భాగమై తక్కువ కాలంలోనే శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యుడయ్యారు. 1990-91 సమయంలో అజ్జాతంలోకి వెళ్లిన ప్రతాప్ అలియాస్ చలపతి పీపుల్స్ వార్.. ప్రస్తుత మావోయిస్టు పార్టీలో దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వచ్చారు.
చలపతి ఎక్కువ కాలంపాటు ఆంధ్ర – ఒడిశా బార్డర్ నిర్మాణంలోనే పనిచేశారు. శ్రీకాకుళం-కోరాపుట్ డివిజన్ ఇన్‌చార్జ్‌గా, తర్వాత ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ రాష్ట్ర మిలిటరీ కమిషన్లలో సభ్యుడిగా పనిచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో జరిగిన మావోయిస్టు దాడుల్లో చలపతి పాత్ర ఉన్నట్లుగా పోలీసులు చెబుతుంటారు. 2017లో ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో సుంకి ఘాట్ సమీపంలో పోలీసులపై జరిగిన బాంబు దాడి ఘటనలోనూ చలపతి పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బలిమెల దాడి, కోరాపుట్ జిల్లా పోలీసు కార్యాలయంపై దాడి ఘటనల్లోనూ ఆయన పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై దాడి చేసి హతమార్చిన బృందానికి చలపతి నేతృత్వం వహించారని పోలీసులు చెబుతున్నారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ మడావి హిడ్మాకు మెంటార్‌గా చలపతికి పేరుంది. మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక బృందంలోనూ చలపతి కీలక నేతగా చెబతుంటారు. మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నచలపతి ఎలా ఉంటారో ఎనిమిదేళ్ల కిందట వరకు పోలీసులకు తెలీదు. చలపతి భార్య అరుణ అలియాస్ చైతన్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తున్నారు. ఆమెది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. 2016లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో అరుణ సోదరుడు ఆజాద్ చనిపోయారు. ఆయన వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో చలపతి, అరుణ తీసుకున్న సెల్ఫీ ఫొటో లభించింది. అప్పుడే చలపతి ఎలా ఉంటారో పోలీసులకు తెలిసింది.
తాజా ఎన్‌కౌంటర్‌లో చలపతి మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. అయితే… చలపతి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా ముత్యంపైపల్లిలో కాకుండా శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో నిర్వహించడం గమనార్హం. విజయనగరం జిల్లా నుంచే ఆయన ఉద్యమ ప్రస్థానం మొదలైంది. శ్రీకాకుళ ప్రాంతంలో ఆయన అనేక ప్రజాఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆ ప్రాంత ప్రజల సొంత మనిషిలా మారారు. ఉద్యమంలోకి వెళ్లిన కొన్నాళ్లకే…. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ సభ్యురాలిని పెళ్లిచేసుకున్నారు. కొంతకాలానికి ఆమె ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది. అలా ఆయనకు శ్రీకాకుళం జిల్లాతో విడదీయరానికి బంధం ఉంది. అందుకే… చలపతి మృతి విషయం తెలుసుకున్న ఉద్దాన ప్రాంత ప్రజలు ఆయనకు తమ ప్రాంతంలో అంతిమ వీడ్కోలు పలికారు.
కాగా… పోలీసులు చలపతి మృతిదేహాన్ని ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారని.. చలపతి భార్య అరుణ తండ్రి అన్నారు.
మొత్తంగా ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి… ఎక్కడో ఉద్యోగం చేసి… చివరకు మరెక్కడో మృత్యువు ఒడికి చేరాడు చలపతి. కానీ.. ఆయన నడిచిన దారిలో ఎందరిని కలిశాడో అందరూ ఆయనను చివరిసారి చూసి… నివాళులర్పించారు. వారంతా చలపతి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.


