ఆంధ్రప్రదేశ్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మొదటిరోజు ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ‘హరహర మహాదేవ శంభో శంకర’ అంటూ స్వామి వారిని కీర్తించుకుంటూ తన్మయత్వాన్ని పొందారు. మొదటి రోజైన ఆదివారం నాడు మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బృంగివాహనంపై శ్రీస్వామి అమ్మవారు ప్రత్యేక పూజలందుకున్నారు.అనంతరం క్షేత్ర పురవీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉగాది మహోత్సవాల దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ నెల 19 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 23 వరకు కొనసాగనున్నాయి. 5 రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు మొదటగా శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ ఈవో ఎస్.లవన్న దంపతులు ఘనంగా ప్రారంభించారు. అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు.