స్వతంత్ర వెబ్ డెస్క్: సమైక్య జీవనరాగానికి రొట్టెల పండుగ ప్రత్యక్ష నిదర్శనం.. మతసామరస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతిబింబంగా, ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించే రొట్టెల పండుగ సందడికి దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. విదేశాల నుంచీ కూడా నెల్లూరుకు తరలి వస్తున్నారు. ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండుగలో ఇవాళ గంధ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. వీళ్లకు కుల మత బేధాలు తెలియవు. అందరూ అన్యోన్యంగా రొట్టెలు పంచుకుంటారు. భక్తి పూర్వకంగా పెద్దల సమాధులను దర్శించుకుంటారు. నెల్లూరులో బారాషాహిద్ దర్గాలో ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ కన్నుల పండువగా జరుగుతోది. రెండో రోజు గంధం సందర్భంగా దేశ విదేశాల నుంచి జనం పోటెత్తారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు దగ్గర ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ రొట్టెల సంబురానికి గతేడాది 30 లక్షల మంది హాజరయ్యారు. ఈ సారి అంతకుమించి వస్తారని అంచనా.. అందుకే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. ఉన్నత చదువులు ఆకాంక్షించే వాళ్ళు కొందరు, సంతాన ప్రాప్తి కోసం మరికొందరు, సొంతింటి కల సాకారమవ్వాలని ఇంకొందరు ఇలా ఎందరో నెల్లూరులోని స్వర్ణాల చెరువు దగ్గరికి వస్తారు. అక్కడ స్నానమాచరించి తమ కోర్కెలు తీర్చమని దేవుళ్ళని వేడుకొంటారు. కోర్కెలు తీరిన వారు అందుకు ప్రతిగా రొట్టెలు తెచ్చి పంచుతారు. ఆ రొట్టె అందుకున్న వారు తిరిగి తమ కోర్కెలు ఫలించాక మళ్ళీ రొట్టెలు పంచుతారు. ఇదే ఆచారం చాలా కాలం నుంచీ జరుగుతోంది. ప్రతి ఏటా మొహరం తరువాత రోజు రొట్టెల పండుగను నిర్వహిస్తారు. ఆగస్టు 3 వరకు ఈ పండుగ జరుగుతుంది. ఇక్కడ పలు రకాల రొట్టెల పంపిణీ జరుగుతుంది.. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి.. ఏ కోర్కె కోరుకుంటే ఆ రొట్టె తీసుకుంటారు.. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు.. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఇదే రొట్టెల పండుగ పద్ధతి..ఇప్పటికే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు దర్గాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.