భారతదేశంలోనూ నీటి సంక్షోభం నెలకొంది. నీటి విషయంలో భారత్‌లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తాజాగా బెంగళూరు నగరంలో నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. సరైన చర్యలు తీసుకోకపోతే బెంగళూరు పరిస్థితే భారతదేశంలోని మిగతా నగరాల్లోనూ నెలకొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నీటి కొరతను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసలే ఎండాకాలం.. అందులోనూ నీటి కొరత.. నగరవా సులకు మంచినీళ్లు దొరకడమే కష్టంగా మారింది. నెలకు కేవలం ఐదు రోజులపాటే స్నానాలు చేసి సరిపెట్టుకున్నారు బెంగళూరువాసులు. గుక్కెడు తాగు నీటి కోసం కర్ణాటక రాజధాని ప్రజలు అల్లాడిపోయారు. నీటి ఎద్దడి ఫలితంగా బెంగళూరులోని అనేక పాఠశాలలు మూతపడ్డాయి. శివారు ప్రాంతాలవాసులందరూ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారప డ్డారు. అనేక కాలనీల్లో ప్రజలు బిందెడు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డారు.ఆఫీసులకు సెలవుపెట్టి వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురు చూడటంలోనే కాలం గడిపారు. దీంతో ట్యాంకర్ల నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. ఈ పరిస్థితి కేవలం బెంగళూరుకే పరిమితం కాదు. మనదేశంలోని అనేక నగరాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. బెంగళూరు నగరంలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి దేశవ్యాప్తంగా అందరినీ కలవరపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని వృథా చేయరాదంటూ నగరవాసులకు అక్కడి వాటర్ సప్లయ్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కానీ, నగరంలోని కొన్ని కుటుంబాలు అధికారుల అదేశాలను ధిక్కరించి నీటిని వృథా చేయడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టింది.ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మే నెలనాటికి సీన్ ఇక ఎలా ఉండబోతోందో అని అందరూ భయపడుతున్నారు. బెంగళూరు ఉదంతంతో నీటి ఎద్దడి మరోసారి తెరమీదకు వచ్చింది. బెంగళూరు ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో అదే పరిస్థితి నెలకొంది.
మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో, నీరు కూడా అంతే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మరీ అవసరం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాలపాలవుతారు. ప్రాణాలు హరీమంటాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. నీటి ఎద్దడి అనగానే మనదేశంలో వెంటనే గుర్తుకు వచ్చేపేరు మరఠ్వాడా. 1972-73 ప్రాంతంలో మహారాష్ట్ర లోని మరఠ్వాడా ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో నీటి ఎద్దడిని నివారించడానికి దుప్కాల్ నివారణ్ పేరుతో ఓ ప్రజా ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమానికి మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సమస్య లపై అవగాహన ఉన్న కొంతమంది నేతలు మద్దతు ప్రకటించారు. మరఠ్వాడా నీటి సంక్షోభం మనిషి సృష్టించిన అనావృష్టి అని ఈ ఉద్యమం తేల్చి చెప్పింది. దీనికి విరుగుడు పరీవాహక ప్రాంతాల మధ్య ఉండే ప్రదేశాలను అభివృద్ధి చేయడమేనని ప్రతిపాదించింది.అయితే ఈ ప్రతిపాదనలను ప్రభు త్వాలేవీ సీరియస్‌గా తీసుకోలేదు.దీంతో మరఠ్వాడా ప్రాంతం ఇప్పటికీ నీటి ఎద్దడితో నానా ఇబ్బందులు పడు తోంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది నీటి కొరత ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాల భవితవ్యం రానున్న రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. ఆఫ్రికా లోని అనేక దేశాల్లో ఇప్పటికే నీటి సంక్షోభం నెలకొంది. గుక్కెడు నీటికి కూడా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధిలో వెనకబడ్డ దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. నీటి ఎద్దడికి ఒకటి కాదు, రెండు కాదు అనేక కారణాలున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవటం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు