మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఈ రోజు జరగనుంది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించ నున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. సారలమ్మను కొలువుదీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది. జాతర మొదటిరోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రం తోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం పరిసరాలు కిక్కెరిసి పోయాయి. వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు దీరడంతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మేడారానికి రానున్నారు.
మేడారం మహాజాతరలో సమ్మక్క రాక ఒక అపూర్వఘట్టం. ఈ వేడుకను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించ డం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన పూజారులు ఇవాళ చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకువస్తారు. ఈ వేడుక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ మొదలవుతోంది. గిరిజన పూజారులు వనం గుట్టలోని అడవిలోకి వెళ్లి కంకవనం తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. సారలమ్మ కన్నెపల్లి నుంచి కదిలొచ్చింది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు భారీ బందోబస్తు నడుమ గిరిజనపూజారులు సారలమ్మను గద్దెలపైకి ప్రతిష్టించారు. అమ్మను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కొండా యి నుంచి గోవిందరాజులు, పూనగండ్ల నుంచి పగిడిద్దరాజును కూడా పూజారులు గద్దెలపైకి చేర్చి.. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు.
మేడారంలోని సమ్మక్క గుడి నుంచి వడెరాలను తెచ్చి గద్దెలపైకి చేరుస్తారు. అనంతరం కుంకుమ భరిణి రూపం లోని సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం మధ్యాహ్నం మూడు గంటలకు చిలకలగుట్టపైకి వెళ్తుంది. ఆ సమయంలో సమ్మక్క రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. దీంతో చిలుకలగుట్ట ప్రాంతంలో ఒకరకమైన ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంటుంది. ప్రధాన పూజారి కక్కెర కృష్ణయ్య గుట్ట పైనుంచి కుంకుమభరిణె రూపంలోని అమ్మవారిని తీసుకొస్తారు. ప్రధాన పూజారి ఒక్కరే గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద సుమారు మూడు గంటల పాటు పూజలు చేస్తారు.పూజారిపై దేవత పూనిన వెంటనే కుంకుమ భరిణె రూపంలోని అమ్మవారిని తీసుకొని అతివేగంగా గుట్ట పైనుంచి కిందికి వస్తారు. సమ్మక్క ఆగమనానికి సూచనగా జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరుపుతారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం అంతా చిలుకలగుట్ట కిందే ఉంటారు. సమ్మక్క ఎదుర్కోళ్ల కార్యక్రమానికి 500 మందికి పైగా పోలీసులను నియమించారు. రోప్ పార్టీని కూడా ఏర్పాటుచేశారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది.
మేడారం వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. రెండు, మూడు రోజుల పాటు ఉండేందుకు గుడారాలు వేసుకు న్నారు. కన్నెపల్లి, నార్లాపూర్, మేడారం.. ఇలా నలువైపులా ఎటుచూసినా గుడారాలే కన్పిస్తున్నాయి. మహా జాతర తొలిరోజు సారలమ్మ రాకకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో గద్దెలను దర్శించి మొక్కులు సమ ర్పించుకున్నారు.


