ప్రముఖ కవి, గాయకుడు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ మృతికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ‘‘తెలుగు సినిమాలలో అభ్యుదయ గీతాల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా గద్దర్ పేరు తలుచు కోవలసిందే. మా భూమి, భద్రం కొడుకో చిత్రములలో ఆయన పాడిన పాటలు చాల పాపులర్ అయినవి. మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది. అలాగే ఆయన రాసి పాడిన ‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్ ఎంపిక చేసింది. 2016, లో దండకారణ్యం మువీ, 2022లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు. ప్రతి పాటను సందేశంగా మలిచి జీవితాంతం ప్రజలను ఆకట్టుకొనేలా ఆడి పాడడం సాధారణ విషయం కాదు. ఒరేయ్ రిక్షా సినిమాలో ఆయన రాసిన పాట అత్యంత ప్రజాదరణ పొందింది. అలాగే అనేక చిత్రాలకు ఆయన పాటలు రాసి ఆలపించారు. ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో చివరిసారిగా ఆయన నటించారు. ఆ సినిమాలో కొన్ని పాటలు కూడా రాశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది.’’ అంటూ టీఎఫ్‌ఫీసీ అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్, కార్యదర్శులు ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి పేరుతో ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.