హైదరాబాద్ మియాపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మియాపూర్, చందానగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉండ నుంది. మియాపూర్‌లో వివాదాస్పదంగా మారిన భూములను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అవినాష్ మహంతి పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మియాపూర్‌లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్‌నగర్ సమీపంలోని సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2 వేల మంది యత్నించగా అడ్డుకునే క్రమం లో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం 144 సెక్షన్ విధించారు.
మరోవైపు మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సంగీత, సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారని దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంగీత అనే మహిళ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుం దామని రెచ్చగొట్టినట్లు గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలా స్పీచ్ లు ఇవ్వడంతో ప్రజలు సంగీత మాటలను నమ్మి భూములకై బయలు దేరినట్లు సమాచారం. అమాయక ప్రజలను ఆశరాగా తీసుకుని భూములు మావేనంటూ ప్రసంగాలు ఇచ్చిన పది మందిపై కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్ తోపాటు మరో ఏడుగురి పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.నిన్న మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని 100, 101 సర్వే నంబర్లలో దాదాపు 504 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమి ఉంది. గుడిసెలు వేసుకుని మూడు, నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేస్తుందని స్థానికంగా ప్రచారం సాగింది. దీంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాదాపు 2 వేల మంది గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని ప్రజలు భీష్మించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిసెలు తీసేది లేదని హెచ్‌ఎండీఏ అధికారులు హెచ్చరించారు. దీంతో అక్కడున్న పోలీసులపై కొందరు రాల్లు విసిరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ప్రభుత్వ భూమి అని తెలియక 16 మంది కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు నిర్ధారించి హెచ్‌ఎండీ ఏకు అప్పగించింది. కొందరు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను లాక్కోవాలని చూస్తున్నారని అధికారులు ఆరోపించారు.


